రాహుల్ ధీమా
న్యూఢిల్లీ: దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు సోమవారం ఐదో విడత పోలింగ్ ప్రారంభమైన వేళ ‘ఎక్స్’లో ఆయన ..‘ఈరోజు ఐదో విడత పోలింగ్ జరుగుతోంది.
బీజేపీని ఓడించి, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నట్లు మొదటి నాలుగు విడతల పోలింగ్‌లో స్పష్టమైంది. విద్వేష రాజకీయాలతో జనం విసిగిపోయారు. యువత ఉద్యోగాలు, రైతులు రుణ మాఫీ, కనీస మద్ధతు ధర, మహిళలు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత, కార్మికులు రోజువారీ వేతనాలు వంటి అంశాలపైనే నేటి పోలింగ్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారు. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు.
అమేథీ, రాయబరేలతోపాటు దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇలా ఉండగా, ఐదో దశలో పోలింగ్ జరుగుతున్న రాయ్‌బరేలీలో పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. రాయ్‌బరేలీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించారు. ప్రజలతో ఆయన సెల్ఫీలు దిగారు. అయితే, మీడియాతో మాట్లాడలేదు.
Comments
Please login to add a commentAdd a comment