కన్యాకుమారిలో సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ధీమా
పథనంతిట్ట: కేరళలో బీజేపీ క్షేత్రస్థాయిలో మరింత బలపడి ఈసారి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోగలదని ప్రధాని మోదీ అభిలషించారు. గత కొద్దిరోజులుగా దక్షిణ భారత రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ శుక్రవారం సైతం తమిళనాడు, తెలంగాణ, కేరళలో పర్యటించారు. కేరళలోని క్రైస్తవుల మెజారిటీ ఎక్కువగా ఉండే పథనంతిట్ట జిల్లాలో మోదీ పర్యటించి అక్కడ క్రైస్తవులను కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ కె.ఆంటోనీని యువతకు ప్రతిరూపంగా మోదీ కొనియాడారు. కేరళ రాజకీయాలకు ఇలాంటి యువ రాజకీయ ప్రతిభావంతులే కావాలని అన్నారు. పథనంతిట్ట ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున ఈసారి అనిల్‌ను బీజేపీ బరిలో నిలిపింది. తర్వాత ఎన్‌డీఏ కార్యకర్తలతో సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ రెండంకెల స్థాయిలో ఓట్ల శాతం సాధించింది. ఈసారి రెండెంకల స్థాయిలో సీట్లనూ గెల్చుకోనుంది. కేరళలో ఈసారి కమలం వికసించడం ఖాయం’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వాలు పోతేనే అభివృద్ధి వస్తుంది
సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటములను విమర్శించారు. ‘‘ ఈ రెండు కూటముల అవినీతి, అసమర్థ ప్రభుత్వాల హయాంలో కేరళ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు’అంటూ ఎల్‌డీఎఫ్ హయాంలో దౌత్యమార్గాల్లో బంగారం స్మగ్లింగ్, యూడీఎఫ్ హయాంలో సోలార్ ప్యానెల్ కుంభకోణాలు జరిగాయని విమర్శలు ఎక్కుపెట్టారు.
‘ఎల్‌డీఎఫ్ ఆ తర్వాత యూడీఎఫ్. మళ్లీ ఎల్‌డీఎఫ్. ఇలా కూటమి ప్రభుత్వాలు కొలువుతీరడం ఆగిపోతే రాష్ట్రంలో అభివృద్ధి మొదలవుతుంది. ఈ కూటములు ఓటు బ్యాంక్ రాజకీయాలకు కేంద్రస్థానాలు. ఈ కూటములు కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కమ్యూనిస్ట్ గూండాలకు అడ్డాలుగా కళాశాలలు విరాజిల్లుతున్నాయి’ అని తూర్పారబట్టారు.
ఆశయాలు నెరవేరుస్తాం
‘లోక్‌సభ ఎన్నికల్లో గత రికార్డులను తిరగరాస్తూ మూడోసారి అధికారంలోకి వస్తాం. అలాగే కేరళలో ఈసారి బీజేపీని ఆశీర్వదించండి. మీ మద్దతును ఓట్లుగా మార్చి ఎక్కువ స్థానాల్లో గెలిపించండి. పూర్తి మద్దతు పలికితే రాష్ట్రాభివృద్ధికి ఎదురవుతున్న అవరోధాలను అధిగమించి మీ ఆశయాలను నెరవేరుస్తాం. ఇది మోదీ గ్యారెంటీ. ప్రపంచంలో ఎక్కడ భారతీయుడు ఇబ్బందిపడినా మోదీ సర్కార్ వెంటనే ఆపన్నహస్తం అందించింది’ అని మోదీ అన్నారు.
తమిళనాడు భవిష్యత్తుకు డీఎంకేనే పెద్ద శత్రువు
తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తుకు అధికారంలోని ద్రవిడ పార్టీయే అతిపెద్ద అవరోధమని ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. శుక్రవారం తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘ భారత దేశ సంస్కృతి, ఘన వారసత్వం అంటే డీఎంకేకు అస్సలు గిట్టదు. అయోధ్యలో భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ క్రతువును రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో స్కీన్‌లపై చూడకుండా నిషేధించాలని డీఎంకే ప్రయత్నించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.
తమిళ పవిత్ర సెంగోల్‌కు మా ప్రభుత్వం పార్లమెంట్‌లో స్థానం కల్పించింది. కానీ, దేశం, దేశ చరిత్ర, వారసత్వం, మహానుభావుల పట్ల డీఎంకే నేతలకు ఉన్న ద్వేషం ఎలాంటిదో ఇట్టే తెల్సిపోతుంది. అన్నాడీఎంకే చీఫ్, దివంగత జె.జయలలితను డీఎంకే పార్టీ నేతలు ఎంతగా అవమానించారో మీకందరికీ తెలుసు. అదే సంస్కృతి ఇప్పుడూ కొనసాగుతోంది. తమిళనాట మహిళలపై నేరాలు ఎక్కువయ్యాయి. నాడు జల్లికట్లును నిషేధించినపుడు డీఎంకే, కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించాయి?. మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తే ఈ పార్టీలు మద్దతివ్వలేదు. మహిళా వ్యతిరేక పార్టీలు ఇవి’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment