లూబా తొమ్మిది నెలల వయసుకు వచ్చింది. నెలనాళ్ల పిల్లగా ఉండగా వెయ్యి రూపాయలు పెట్టి లూబాను కొని ఇంటికి తెచ్చుకున్నాడు టెర్డే యోమ్చా. సొంత చెల్లిలా చూసుకున్నాడు. లూబా అందమైన ఆడ ఎలుగు పిల్ల. గౌన్లు కుట్టించాడు. వెంటపెట్టుకుని ఊళ్లో తిప్పాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపు ఈ అన్నా చెల్లెళ్లది. చెల్లికి తనే స్నానం చేయించేవాడు టెర్డే. చెల్లిని పూర్తి శాకాహారిగా పెంచాడు. పప్పన్నం, క్యాబేజీ, మొక్కజొన్న, టమాటా, చెరకుగడలు, పండ్లు ప్రేమగా తినిపించేవాడు. పాలు తాగించేవాడు. లూబా కూడా ఎప్పుడూ టెర్డే అన్నయ్య వెంటే ఉండేది. అన్నయ్య ఏం చేస్తుంటే అది చెయ్యాలని చూసేది. అన్నయ్య పాఠ్యపుస్తకాలు చదువుతుంటే తనూ చదవడానికి తయారయ్యేది! మనిషి, ఎలుగు తోడబుట్టినట్లు ఉండేవారు. ఇన్ని చెబుతుంటే.. ‘అయ్యో భగవంతుడా లూబాకు ఏమైనా అయిందా?’ అనిపిస్తుంది. పాత సినిమాల్లో అంతే కదా. హీరో చెల్లెలు పుట్టినరోజు ఫంక్షన్ లో ’అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’ అనో, ’అన్నా నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం’ అనో పాట పూర్తి అవగానే ఎక్కడినుంచో దోపిడీ దొంగలు వచ్చి ఆమెను కిడ్నాప్ చేసేవారు.
లేదంటే తుపాకీతో కాల్చేసి వెళ్లేవారు. లూబాకు అలాంటిదేమీ కాలేదులెండి. అన్న టెర్డే కే అయింది. లూబాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఇచ్చేశాడు! వాళ్లు లూబాను అడవిలో వదిలేయబోతుంటే.. ‘వద్దొద్దు. అడవిలో ఎలా పెరుగుతుందో ఏమో పిచ్చిపిల్ల‘ అని వెనక్కు తీసుకుని వాళ్ల చేతే ఇటానగర్ లోని ‘జూ’ లో చేర్పించాడు. రాజధాని నగరం అది. అక్కడైతే తన చెల్లి కంఫర్ట్‌గా పెరుగుతుందని అన్న మనసు తలచింది. చెల్లిని చూడాలనిపించినప్పుడు వెళ్లి చూసే ఒప్పందం కూడా జూ అధికారులతో చేసుకున్నాడు. చెల్లిని వదిలేసి వస్తున్నప్పుడు అన్నని, ‘ఇప్పటివరకు అన్నయ్య నాతోనే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమయ్యాడు!’ అని బోను లోపలి నుంచి అన్నయ్యను వెతుక్కుంటున్న చెల్లినీ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాలేదంటే వాళ్లు మనుషులు గానీ, ఎలుగులు కానీ అయి ఉండరు. అయినా టెర్డే అన్నయ్య మనసు చంపుకుని ఇంత పని ఎందుకు చేసినట్లు? స్కూల్ చదువు పూర్తయి, కాలేజ్‌కి వచ్చాడు. కాలేజ్‌లో చేరేందుకు వేరే ఊరు వెళ్లిపోతున్నాడు. చదువులెంత కనికరం లేనివి!
Comments
Please login to add a commentAdd a comment