భోపాల్: ఉప ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాహుల్ సింగ్ లోధి ఆదివారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దామో నియోజకవర్గానికి రాహుల్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ రామేశ్వర్ శర్మకు అందచేశారు. ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్‌తో కలిసి నేను సుమారు 14 నెలలు పనిచేశాను. అయితే అభివృద్ధి కోసం పని చేయలేకపోయాను. నా నియోజకవర్గంలో అన్ని ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. బీజేపీలోకి నేను ఇష్టపూర్వకంగానే చేరాను’ అని తెలిపారు. (అత్యంత సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం)
ముఖ్యమంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ఆ పార్టీ నేతలకు ఆశలు సన్నగిల్లాయన్నారు. అభివృధి కోసం పని చేయాలనుకునేవాళ్లు ఆ పార్టీని వీడుతున్నారన్నారు. రాహుల్ బీజేపీలో చేరిక నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కాగా రాహుల్ కాంగ్రెస్‌ను వీడటంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 87కి పడిపోయింది. అలాగే ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నారాయణ్ పటేల్, ప్రద్యం సింగ్ లోధి, సుమిత్రా దేవి కూడా పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.
Comments
Please login to add a commentAdd a comment