ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని రోడ్లు మృత్యు కుహరాలుగా మారాయి. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,456 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 11,542 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ద్వితీయ స్థానానికి చేరింది. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనదైన పద్దతిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రాణం ఎంతో విలువైందని, నిదానమే ప్రధానం, ప్రమాదకర మలుపు, స్పీడ్ బ్రేకరు ఉందని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఇలా అనేక రకాల హెచ్చరికల బోర్డులు ఉన్నప్పటికి డ్రైవర్లు వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
అనేక మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి బాధ్యులవుతున్నారు. అయినప్పటికీ డ్రైవర్లలో మార్పు రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు వెల్లడించడంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా గత సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,456 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 11,542 మంది మృతి చెందారు. ముఖ్యంగా దేశంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన మూడు రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా తన పేరును నమోదుచేసుకుంది.
నాకు ప్రమాదాలులేని రాష్ట్రం కావాలి: ముఖ్యమంత్రి ఠాక్రే
మహారాష్ట్రను ప్రమాదాలులేని రాష్ట్రంగా చూడాలని ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడం కాదని, రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఉండకూడదని ఠాక్రే పేర్కొన్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన రోడ్డు భద్రత వారోత్సవాలను సంవత్సరానికి, నెలకు ఒకసారి పరిమితం చేయకుండా ప్రతి రోజు రోడ్డు భద్రతా వారోత్సవాలుగా జరుపుకోవాలన్నారు. అదేవిధంగా వాహనాలు నడిపేసమయంలో అందరూ నియమాలను, సంయమనాన్ని పాటించాలన్నారు. లేదా ఈ రెండు వ్యాఖ్యాలలో (నియమ్, సంయమ్) యమ్ ఉందని మనం వీటిని పాటించనట్టయితే యమ్ (య ముడు) వచ్చి మన ప్రాణాలను తీసుకెళ్తాడంటూ అభివర్ణించారు. ప్రమాదాలు జరగనేవద్దు. కానీ, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదాల్లో గాయపడినవారి ప్రాణాలను రక్షించేందుకు అత్యధిక ప్రయత్నం చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని వాటికి సమీపంలో ట్రామా కేర్ సెంటర్‌లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నం: నితిన్ గడ్కరి
దేశంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర సమస్యగా మారిందని దీంతో దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ప్రతి రోజు 415 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ఇటీవలే స్వీడన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇలాగే ఉంటే 2030 వరకు దేశంలో రోడ్డు ప్రమాదాలతో సుమారు 6.7 లక్షల మంది మృతి చెందే అవకాశాలున్నాయని అంచనా ఉంది. కాని, తాము అలా జరగకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముఖ్యంగా 2025 నాటికి దేశంలో 50 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment