ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసు సంచలనంగా మారింది. ఈ ప్రమాదానికి శివసేన నేత కుమారుడు మిహిర్ షానే కారణమని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, సీఎం షిండే సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హిట్ రన్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ ప్రమాదంలో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. నిందితులకు శిక్ష పడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజలే మాకు ముఖ్యం. ప్రజల భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అని కామెంట్స్ చేశారు. ఇక, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు.
మరోవైపు.. మహారాష్ట్రలోని వర్లీ పోలీసులు మిహిర్‌పై ర్యాష్ డ్రైవింగ్, హత్యకు సంబంధించి కేసుతోపాటు, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మిహార్ షా పారారీలో ఉండటంతో ఆరుగురు పోలీసుల బృందం అతనికోసం గాలిస్తుంది.
జరిగింది ఇది..
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఆదివారం ఉదయం బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్ నుంచి భార్య కావేరీ నక్వాతో పార్థిక్ నక్వా బైక్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కావేరీ నక్వా మరణించగా.. ఆమె భర్త పార్థిక్ నక్వాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్లాన్ ప్రకారమే జంప్..
మిహిర్ షా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. రాజేష్ షా వ్యాపారాల్లో మిహిర్ షా సహకారం అందిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుఉన్నాడు. ఇక, ఈ ప్రమాదానికి ముందు.. మిహిర్ మద్యం మత్తులో ఉన్నాడు. డ్రైవర్‌తో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని సూచించాడు. జుహూ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ను పక్కకు తప్పించి మిహిర్ షానే స్వయంగా డ్రైవ్ చేశాడు. ప్రమాదం తరువాత కారును బాంద్రా కళానగర్‌లో వదిలి అక్కడి నుంచి మిహిర్ షా పరారయ్యాడు. అంతకుముందు.. కారుపై ఉన్న శివసేన స్టిక్కర్ ను తొలగించే ప్రయత్నం చేశాడు. కారున తన తండ్రి పేరుపై ఉందని తెలియకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ ను సైతం తొలగించాడని పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment