గోవా రిసార్టులో షిండేకు స్వాగతం పలుకుతున్న ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్
ముంబై/గోవా: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది. ఇందుకోసం ఆది, సోమవారాల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి షిండే సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందే కీలకమైన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఆ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ పేరు ఖాయమైంది.
కొలాబా నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన శుక్రవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరఫున అభ్యర్థి పోటీకి దిగితే ఆదివారం ఎన్నిక జరుగుతుంది. ఎంవీఏ హయాంలో ఎన్నిసార్లు కోరినా స్పీకర్ ఎన్నికకు ఒప్పుకోని గవర్నర్ ఇప్పుడెందుకు అనుమతించారంటూ కాంగ్రెస్ మండిపడింది. గత ఫిబ్రవరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే రాజీనామా చేసినప్పటి నుంచీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉంది.
ఫడ్నవీస్‌ది పెద్ద మనసు: షిండే
‘‘బాల్ ఠాక్రే అనుయాయుడైన శివ సైనికుడు సీఎం అయినందుకు నా తోటి ఎమ్మెల్యేలు మాత్రమే గాక మహారాష్ట్ర అంతా ఆనందంగా ఉంది’’ అని షిండే అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత గురువారం అర్ధరాత్రి గోవా తిరిగి వెళ్లారు. ఆయన శిబిరంలోని 50 మంది ఎమ్మెల్యేలు సాదర స్వాగతం పలికారు. షిండేకు, బాల్ ఠాక్రేకు అనుకూల నినాదాలతో హోరెత్తించారు. గౌహతిలో 8 రోజుల క్యాంపు అనంతరం వారంతా బుధవారం రాత్రి గోవా చేరుకోవడం, గురువారం షిండే ఒక్కరే ముంబై వెళ్లి నాటకీయ పరిణామాల మధ్య సీఎం పదవి చేపట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తనపై నమ్మకముంచి సీఎం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కృతజ్ఞతలన్నారు. ‘‘నన్ను సీఎంగా అంగీకరించి ఫడ్నవీస్ పెద్ద మనసు చాటుకున్నారు. ఇది నిజంగా ఫడ్నవీస్ మాస్టర్‌స్ట్రోక్. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో పెద్ద మనసుండాలి. మహారాష్ట్రలో అధికారం కోసం బీజేపీ తపించిపోతోందని భావిస్తున్న వాళ్లందరికీ ఇదో కనువిప్పు’’ అన్నారు. సోమవారం జరిగే బల పరీక్ష లాంఛనం మాత్రమేనని, తనకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించారు.
ఈ ఆలోచన అప్పుడేమైంది: ఉద్ధవ్
బీజేపీ తనకు వెన్నుపోటు పొడిచిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే దుయ్యబట్టారు. శివసైనికున్ని సీఎం చేశామన్న బీజేపీ వాదనను ఎద్దేవా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘రెండున్నరేళ్లకు సీఎంను మార్చుకుందామంటూ 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు నాకిచ్చిన మాటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కట్టుబడి ఉంటే మా సారథ్యంలో మహా వికాస్ అఘాడీ సంకీర్ణం అధికారంలోకి వచ్చేదే కాదు.
పైగా రెండున్నరేళ్లు పూర్తయింది గనుక ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ నేతే సీఎం అయేవాడు’’ అన్నారు. బీజేపీ సీఎం పదవి చేపట్టకపోవడాన్ని ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వాన్ని కూల్చి ఆ పార్టీ ఏం బావుకుందని ప్రశ్నించారు. షిండేను శివసేన సీఎం అనడాన్ని తీవ్రంగా ఖండించారు. ముంబైలో ప్రతిపాదిత మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును కంపూర్‌మార్గ్ నుంచి ఆరే కాలనీకి మారుస్తూ షిండే తన తొలి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘మీకు చేతులెత్తి మొక్కుతా. నాపై కోపాన్ని ముంబైపై తీర్చుకోవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. ‘శివసేన నేత’ పదవి నుంచి షిండేను తొలగిస్తున్నట్టు పేర్కొంటూ ఆయనకు ఉద్ధవ్ లేఖ రాశారు.
అనైతిక బీజేపీ: సామ్నా
రాష్ట్రంలో అనైతిక మార్గంలో బీజేపీ అధికారం చేజిక్కించుకుందంటూ శివసేన పార్టీ పత్రిక సామ్నా తూర్పారబట్టింది. కేంద్రంలో తిరుగులేని మెజారిటీ ఉందనే అహంకారంతో విపక్షాలను ఇలా మింగేస్తూ పోతే ప్రజాస్వామ్యానికి మనుగడేదని ప్రశ్నించింది. ‘‘నిండు సభలో ద్రౌపదిని కౌరవులు అవమానిస్తుంటే ధర్మరాజు నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోనూ అలాంటిదే జరిగింది. అప్పుడు ద్రౌపది మానాన్ని రక్షించిన కృష్ణుడు ఇప్పుడు రాష్ట్ర ప్రజల రూపంలో సుదర్శన చక్రం అడ్డేసి మహారాష్ట్ర గౌరవాన్ని కాపాడతాడు’’ అని ఆశాభావం వెలిబుచ్చింది. మరోవైపు, షిండేతొ రాజీకి రావాల్సిందిగా ఉద్ధవ్‌పై ఎంపీలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పార్టీకి 19 మంది లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులున్నారు.
చదవండి: గోవా హోటల్‌లో చిందులు.. రెబెల్ ఎమ్మెల్యేలపై సీఎం షిండే అసంతృప్తి..
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
కాగా ఈ నెల 2,3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ స్పీకర్ పదవికి ఎన్నిక అవసరమైతే జూలై 3న నిర్వహించనున్నారు. కాగా గత ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment