ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం | Maharashtra MLAs Suspension: SC Decision Tight Slap on State Govt | Sakshi
Sakshi News home page

ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం

Published Sat, Jan 29 2022 9:20 AM | Last Updated on Sat, Jan 29 2022 9:24 AM

Maharashtra MLAs Suspension: SC Decision Tight Slap on State Govt - Sakshi

సాక్షి, ముంబై: అసెంబ్లీ సమావేశాల సమయంలో ఓబీసీ రిజర్వేషన్‌పై గందరగోళం సృష్టించినందుకు వేటుపడిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన ట్వీట్‌ చేశారు. అంతేగాకుండా పక్షపాతం లేకుండా తీర్పునిచ్చినందుకు సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సస్పెన్షన్‌ రద్దయినందుకు 12 బీజేపీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు.  

అసలేం జరిగింది..
2021లో జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో ఓబీసీ రిజర్వేషన్‌పై చర్చ జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్‌కు అనుకూలంగా గళం విప్పారు. ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో అధికార మహావికాస్‌ ఆఘాడికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో విపక్ష సభ్యులపై తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో స్పీకర్‌ సీటులో కూర్చున్న భాస్కర్‌ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించారని, ఆయనపై దాడిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలపై సంవత్సరకాలం పాటు సస్పెండ్‌ వేటు పడింది. అప్పటినుంచి ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనం మెట్లు ఎక్కలేదు. బీజేపీ శాసనసభ్యులు స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

చదవండి: (ఒక సెషన్‌కు మించి సస్పెన్షన్‌)

మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక ఎమ్మెల్యేను 60 రోజులకంటే ఎక్కువ సస్పెండ్‌ చేయడమంటే, ఒక విధంగా ఎమ్మెల్యే పదవి రద్దు చేయడంతో సమానమని కోర్టు పేర్కొంది. ఎలాంటి నియోజకవర్గమైనా ఆరు నెలలకంటే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధి లేకుండా ఉండరాదు. దీంతో సంవత్సర కాలంపాటు సస్పెండ్‌ వేటు వేయడం తప్పని పేర్కొంటూ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వేటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార బలంతో విపక్షాలను అణచివేయాలని ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టని విపక్షాలు వ్యాఖ్యానించాయి. 

సుప్రీంకోర్టు పెత్తనం తగదు: రావుత్‌ 
అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన ఎంపీ సంజయ్‌ రావుత్‌ శుక్రవారం ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విధాన్‌ సభ అధికారాలను ఆక్రమించుకుందని, పాలనా వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు. గతంలో రాజ్యసభలో మా పార్టీకి చెందిన కొందరు ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. ఆ సమయంలో సుప్రీం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్‌ ద్వారా నామినేట్‌ అయ్యే 12 మంది ఎమ్మెల్యేల జాబితాకు ఇంతవరకు క్లియరెన్స్‌ ఇవ్వక పోవడంతో గత రెండు సంవత్సరాల నుంచి వారు వేచి చూస్తున్నారు. ఆ ఫైల్‌ ఇంతవరకు గవర్నర్‌ వద్దే పడి ఉందని, ఇప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కే ఉన్నప్పటికీ దీనిపై సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని రావుత్‌ ప్రశ్నించారు.

రిజర్వేషన్‌ చర్చ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నానా రభస చేశారు. సభా నియమాలు ఉల్లంఘించడమేకాకుండా, కార్యకలాపాలు సాగకుండా అడ్డుకున్నారు. అందువల్లే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సి వచ్చిందన్నారు. కానీ సు ప్రీంకోర్టు తీర్పు సభా నియమాలపై ఆధిపత్యంగా భా విస్తున్నామన్నారు. చట్టసభల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న సుప్రీంకోర్టు గవర్నర్‌ వద్దనన్న మా 12 మంది ఎమ్మెల్యేల ఫైల్‌ విషయంలో ఎందుకు స్పం దించడం లేదని, జోక్యం చేసుకుని ఎందుకు క్లియరెన్స్‌ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement