మహాయుతిలో బీజేపీకి సింహభాగం.. 152–155 సీట్లు
శివసేన (షిండే)కు 78–80 స్థానాలు
ఎన్సీపీ (అజిత్)కు 52 నుంచి 54 సీట్లు
మహావికాస్ అఘాడిలో పెద్దన్న కాంగ్రెస్
హస్తం పార్టీకి 105–110 సీట్లు
శివసేన (యూబీటీ)కి 90–95
ఎన్సీపీ (శరద్‌పవార్)కు 75–80
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య మంగళవారం సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ సగం కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ 152 నుంచి 155 సీట్లు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 78–80 స్థానాల్లో పోటీచేయనుంది.
అజిత్ పవార్ నేతృత్వంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ 52–54 స్థానాల్లో పోటీచేసేలా ఒప్పందానికి వచ్చాయని తెలిసింది. బీజేపీ ఇప్పటికే 99 మందితో తొలి జాబితాను విడుదల చేసింది కూడా. శివసేన (షిండే) 45 మందితో మంగళవారం తొలి జాబితా విడుదల చేసింది. అఘాడిలో సమసిన విభేదాలు: సీట్ల పంపకంపై విపక్ష మహావికాస్ అఘాడిలో విభేదాలు సమసిపోయినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) మధ్య మాటలయుద్ధం నడవడం తెలిసిందే. శరద్‌పవార్, ఉద్ధవ్‌లతో మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి రమేశ్ చెన్నితాల చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అఘాడి భాగస్వామ్యపక్షాలు స్థూలంగా ఒక ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ 105 నుంచి 110 స్థానాల్లో పోటీచేయనుంది. శివసేన (యూబీటీ) 90–95 స్థానాల్లో, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) 75–80 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment