![Mamata Banerjee Martyrs Day speech in various languages across India - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/19/MAMAATA.jpg.webp?itok=gGtZz9IA)
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికార పీఠమెక్కిన టీఎంసీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఏటా జూలై 21న జరిగే అమరవీరుల దినోత్సవం రోజు సీఎం మమతా బెనర్జీ ప్రసంగం బెంగాల్‌తోపాటు వివిధ రాష్రాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. బెంగాల్‌తోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, త్రిపురల్లో ఏర్పాటయ్యే భారీ స్క్రీన్లపై ఈ ప్రసంగాన్ని ప్రసారం చేయనుంది.
అమరవీరుల దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ వర్చువల్‌గా బెంగాలీలో చేసే ప్రసంగం వివిధ భారతీయ భాషల్లోకి అనువదించి, ప్రసారం చేస్తామని టీఎంసీ నేత ఒకరు వెల్లడించారు. 21న దీదీ ప్రసంగాన్ని ప్రజలంతా చూసేలా గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ స్క్రీన్ టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రం తమిళనాడుపై కన్నేసిన టీఎంసీ.. దివంగత జయలలిత మాదిరి గా, మమతా బెనర్జీని ‘అమ్మ’గా పేర్కొంటూ ఇప్పటికే చెన్నైలో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. 1993లో ఓటరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే డిమాండ్‌తో అప్పటి యూత్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయారు. ఆ ఘటన చోటుచేసుకున్న జూలై 21ని అమరవీరుల దినంగా టీఎంసీ పాటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment