బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో ఐదు తోడేళ్లను పట్టుకున్న తర్వాత కూడా నరమాంస భక్షక తోడేళ్ల బెడదకు అడ్డుకట్టపడలేదు. మంగళవారం రాత్రి రెండు వేర్వేరు గ్రామాల్లో బాలికలపై దాడి చేసిన తోడేళ్లు బుధవారం రాత్రి కూడా ఒక వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ వృద్ధురాలు నిద్రిస్తుండగా, ఇంటిలోకి దూరిన తోడేలు ఆమె గొంతుకొరికి, మంచంపై నుంచి కిందికి లాగి పడేసింది. ఈ దాడిలో వృద్దురాలి మెడకు బలమైన గాయమైంది. ఈ దాడి నేపధ్యంలో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియన్ పూర్వా తప్రా గ్రామంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో పుష్పాదేవి అనే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో తోడేలు ఆమెపై దాడి చేసింది. ఆమె కేకలు వేయడంతో ఆమె కోడలు వచ్చి, తోడేలును తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఇంతలో చుట్టుపక్కలవారు రావడంతో ఆ తోడేలు పారిపోయింది. బాధితురాలికి తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి, ఆ తరువాత బహ్రయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.
గత రెండు రోజుల్లో నరమాంస భక్షక తోడేళ్లు దాడి చేయడం ఇది మూడోసారి. ఇలా తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటం గురించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) చీఫ్ ఎస్పీ యాదవ్ మీడియాకు పలు వివరాలు తెలిపారు. ఆ తోడేళ్లు రేబిస్ బారినపడటం లేదా వాటికి కెనైట్ డిస్టెంపర్ వైరస్ సోకడమో కారణంగా అవి ఇలా ప్రవర్తిస్తున్నాయన్నారు. తోడేళ్ల వరుస దాడులు అసాధారణ అంశమని, గత పదేళ్లలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని అన్నారు. దీనిపై అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోందన్నారు. దాడులకు పాల్పడుతున్న తోడేళ్ల నమూనాలను విశ్లేషించడం ద్వారా వాటి దాడుల వెనుకనున్న కచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చని యాదవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment