గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చాలా రోజులుగా అట్టుడికి పోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం మరోసారి హింస చెలరేగింది. ఇంపాల్ ఈస్ట్, కాంగ్‌పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘటన జరిగింది. ఇందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఇంపాల్ వెస్ట్ ప్రాంతంలో గల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిపిజెన్ అధికారిక నివాసంపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించారు.
చదవండి: ‘నీట్’ని క్రాక్ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ..
ఈ ఘటన బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఘటన సమయంలో మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చేపడుతున్నారు. నివేదికల ప్రకారం ఖమెన్‌లోక్ గ్రామంలో దుండగులు అనేక ఇళ్లను తగలబెట్టారు. హింసాత్మకమైన ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భద్రతా సిబ్బంది హైరిస్క్ ప్రాంతాల్లో గస్తీ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో తెంగ్నౌపాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల నుండి తుపాకీలతో పాటు 63 మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 1,040 ఆయుధాలు, 13,601 మందుగుండు సామాగ్రి, 230 రకాల బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో సాధారణ ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండగా.. ప్రస్తుతం ఆ సమయాన్ని ఉదయం 5 నుండి ఉదయం 9 గంటల వరకు కుదించారు. మణిపూర్‌లోని 16 జిల్లాల్లో 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది, మొత్తం ఈశాన్య రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
చదవండి: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత.. 400 కార్ల కాన్వాయ్‌తో భారీ ర్యాలీ.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment