Massive Solar Flare May Impact Satellite Communications - Sakshi
Sakshi News home page

Solar Flare: రికార్డు స్థాయిలో భానుడి భగభగలు.. జీపీఎస్‌, విమానాలపై ఎఫెక్ట్‌

Published Wed, Apr 20 2022 2:52 PM | Last Updated on Wed, Apr 20 2022 3:57 PM

Massive Solar Flare May Impact Satellite Communications - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్‌ నెలలోనే భానుడు భగభగమని ఉగ్రరూపం చూపిస్తున్నాడు. బుధవారం సూర్యుడి నుంచి సౌరజ్వాలల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్​వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో సౌరజ్వాలలతో భానుడు విరుచుకుపడ్డాడు. ఈ విషయాన్ని కోల్‌కత్తా వేదికగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్​ స్పేస్ సైన్సెస్(CESSI) ఇండియా వెల్లడించింది.

కాగా, భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.27 గంటలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలు వెలువడ్డాయని.. ఇవి సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలను దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని సెస్సీ(CESSI) వెల్లడించింది. ఈ సందర్బంగా ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు నంది మాట్లాడుతూ.. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్​12992 నుంచి బుధవారం ఉదయం 9.27గంటలకు X2.2 తరగతికి చెందిన సౌరజ్వాలలు వెలువడ్డాయని అన్నారు.

ఈ సౌరజ్వాలల ప్రభావం భారత్​, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రభావం చూపించిందని తెలిపారు. దీని వల్ల హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం, ఉపగ్రహాలు, జీపీఎస్​పనితీరులో లోపాలు, ఎయిర్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు.  అయితే, ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని ఏప్రిల్​ 18నే తమ బృందం అంచనా వేసిందని ఆమె చెప్పారు. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. 

సౌరజ్వాలలు అంటే..
సౌర వ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడటాన్నే సౌరజ్వాలలు అంటారు. ఈ సౌరజ్వాలల వల్ల రేడియా సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్, నేవిగేషన్ సిగ్నల్స్ ప్రభావితమై.. విమానాలకు, వ్యోమగాములకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇక, సౌరజ్వాలల తీవ్రతను బట్టి నాసా.. వీటిని A నుంచి B, C, M, X వంటి తరగతులుగా విభజించింది. కాగా, బుధవారం వచ్చిన ఎక్స్ తరగతి సౌరజ్వాల అన్నింటికన్నా తీవ్రమైనది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement