ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆలయంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి గోవర్ధన్‌లో గల ముకుట్ ముఖారవింద్ ఆలయంలో భారీ చోరీ జరిగింది. పూజారే స్వయంగా ఈ దొంగతనానికి పాల్పడటం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముకుట్ ముఖారవింద్ ఆలయ పూజారి దినేష్ చంద్ రూ. ఒక కోటి 9 లక్షల రూపాయలతో పరారయ్యాడు. దినేష్ చంద్ ఈ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాడు. అయితే ఆ తరువాత ఆలయానికి తిరిగి రాలేదు. పూజారి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఈ ఉదంతంపై ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గోవర్ధన్ పోలీసులు నిందితుని కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ ఘటన గురించి ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ మాట్లాడుతూ ఆలయ పూజారి దినేష్ చంద్ ఆలయానికి సంబంధించిన సొమ్ములో సుమారు రూ. ఒక కోటి 9 లక్షలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దస్వీసా నివాసి అయిన నిందితుడు, పూజారి దినేష్ చంద్ ఇంటిలో నుంచి పోలీసులు రూ. 71 లక్షల 92 వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము గురించి ఆరా తీస్తున్నారు. ఆ పూజారి భార్య స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, ఆలయానికి సంబంధించిన సొమ్మును అప్పగించింది. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment