సురేష్ అంగడి (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు.
కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సురేశ్ అంగడి 2000-2004 మధ్య కాలంలో బెల్గాం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. బెల్గాం జిల్లాలోని కేకే కొప్పా ఆయన స్వస్థలం. సురేశ్ తల్లిదండ్రులు సోమవ్వ, చెన్నబసప్ప. సురేశ్ భార్య పేరు మంగల్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు.
కర్ణాటకలో కరోనా బారిన పడి మరణించిన బీజేపీ రెండో ఎంపీ సురేష్ అంగడి. రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్ గస్తీ(55) ఈ నెల 17న బెంగళూరులో కన్నుమూశారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పోవడం బీజేపీ శ్రేణులను తీవ్ర వేదనకు గురిచేసింది. సురేష్ అంగడి హఠాన్మరణం పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. (కరోనా: బీజేపీ ఎంపీ కన్నుమూత)
సురేశ్ మరణం బాధాకరం: ప్రధాని
సురేశ్ అంగడి మరణంతో నిబద్ధత కలిగిన కార్యకర్తను పార్టీ కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చాలా కృషి చేశారని తెలిపారు. ఎంపీగా, మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. సురేశ్ అంగడి మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎం జగన్ తీవ్ర సంతాపం
కేంద్ర మంత్రి సురేశ్ అంగడి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం-ఢిల్లీ కిసాన్ రైలును ఆయన ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సురేశ్ అంగడి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment