సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈస్ట్ కోస్టు రోడ్డులో ఆదివారం ఉదయం సైకిల్ పయనంతో దూసుకెళ్లారు. 30 కి.మీ దూరం ఆయన సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. మార్గమధ్యలో యువత సెల్ఫీలు, ప్రజలతో పలకరింపులు సాగాయి. ఆరోగ్య పరిరక్షణ విషయంలో డీఎంకే స్టాలిన్ ఎప్పుడు ముందుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటిస్తుంటారు. అలాగే, ఎన్నికల వేల వాకింగ్‌లతో ప్రచారం, పాదయాత్రలు అంటూ ముందుకు సాగారు. గత నెలన్నర రోజులుగా క్షణం తీరిక లేకుండా బిజిబిజీగా గడిపిన స్టాలిన్‌కు ప్రస్తుతం కాస్త విరామం దక్కింది. ఎన్నికలు ముగియడంతో గెలుపు ధీమా స్టాలిన్‌లో ఎక్కువగానే ఉంటోంది.
ఎన్నికల ముందు సాగిన సర్వేలు, ఆతర్వాత సర్వేలు, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికతో అధికారం తమదే అన్న ధీమా స్టాలిన్‌లో పెరిగింది. గత నెలన్నర రోజులుగా వ్యాయామానికి విరామాన్ని ఇచ్చిన స్టాలిన్ మళ్లీ మొదలెట్టారు. సైక్లింగ్‌తో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఆదివారం ఉదయాన్నే తన నివాసం నుంచి సైకిల్ పయనం మొదలెట్టారు. సైక్లింగ్‌లో దూసుకెళ్లే వారి తరహాలో డ్రెస్ ధరించి, భద్రతా సిబ్బందిని దూరంగా ఉంచి తానే యువకుడిని అన్నట్టుగా చలాకీగా సైక్లింగ్‌లో దూసుకెళ్తారు.
చెన్నై ఈసీఆర్ మార్గంలో ఆయన ముప్పై కిలో మీటర్లు దూరం సైకిల్ పయనం చేయడం విశేషం. ఈ పయనంలో స్టాలిన్‌ను గుర్తు పట్టిన యువత ఎందరో, వారందరు ఆయనతో సెల్ఫీలు దిగారు. కొన్ని చోట్ల ప్రజల్ని పలకరిస్తూ, అభివాదం తెలుపుతూ స్టాలిన్ ముందుకు సాగారు. వ్యాయామంపై శ్రద్ధ వహించే స్టాలిన్ గతంలో కూడా పలుమార్లు సైక్లింగ్ చేసి అభిమానులు, ప్రజల్ని పలకరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment