పోలీసులపై దాడి చేస్తున్న జనం
మైసూరు: ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకిస్టు జారి పడి మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. దీంతో కోపం వచ్చిన ప్రజలు పోలీసులను చితక్కొట్టారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియోలు వైరల్ అయ్యాయి. వివరాలు.. మైసూరు నగరం బోగాది రింగ్ రోడ్డుపై దేవరాజ్ బైక్ నడుపుతుండగా సురేష్ అనే వ్యక్తి వెనుక కూర్చున్నాడు. కాస్త ముందు పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పోలీసులు చెయ్యెత్తి ఆపమనడంతో బైక్ అదుపు తప్పి కింద పడడం, దేవరాజ్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వాదన ముదిరి కొందరు వ్యక్తులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడి చేశారు. ఒక పోలీస్ జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.
Traffic Cop thrashed by locals in Mysore who were furious after one of the riders the cops tried to stop fell of the bike and lost his life. pic.twitter.com/n02bkc0F1t
— Deepak Bopanna (@dpkBopanna) March 22, 2021
ఏం జరిగిందో తెలియదు..
పోలీసులు మాట్లాడుతూ బైక్‌ను టిప్పర్ ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని, తమ తప్పేం లేదని చెప్పారు. బైక్ ప్రమాదంలో గాయపడిన సురేష్ తాము పొలీసులకు సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్నామని, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ తమ బైకును డీకొట్టిందని, కిందపడిన తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. దాడికి గురైన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment