ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్‌ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి.
మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment