కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. తమకు పగ ఏర్పడితే ఎంత దూరమైనా వెళ్తామని జబ్బలు చరుస్తున్నాయి. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం. కానీ అన్ని పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన దుఃఖ బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది.
ఉదాహరణకు రాముడి పగ రావణ సంహారంతో ఆగలేదు. రాక్షస వంశాన్ని దాదాపు తుడిచి పెట్టింది. ఆయనంటే సర్వసమర్థుడు కాబట్టి ఆ స్థాయిలో పగ తీర్చుకున్నాడు. కానీ సాధారణ ప్రాణికి దుఃఖం, కోపం కలిగించినా ప్రతీకారం తీర్చుకునే శక్తిలేక ఊరుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రామ బంట్లుగా భావించే కోతులు మాత్రం తమకు కలిగిన బాధకు గట్టిగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఎంతైనా మనకు పూర్వీకులు కదా! వాటికి తెలివితేటలు ఎక్కువే. అందుకే పక్కాగా తమ ప్రత్యర్ధి వర్గంపై దాడులు చేసి వంశనాశనానికి పూనుకున్నాయి. ఇంతకూ ఇవి పగ తీర్చుకున్నది ఎవరిమీదన్నదే డౌటు కదా! వీటి వర్గ శత్రువులు కుక్కలే! ఫ్యాక్షన్ సినిమా స్టోరీని తలపించే ఈ కథ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్‌గావ్‌లో జరిగింది.
ఏం జరిగింది?
కోతులు వర్సెస్ కుక్కల పోరాటానికి కొన్నాళ్ల క్రితం జరిగిన ఘటన బీజం వేసిందని మజల్‌గావ్ గ్రామస్తులు తెలిపారు. గతనెల్లో కొన్ని కుక్కలు ఒక కోతిపిల్లను వేటాడి చంపాయి. ఇది కోతుల మందలన్నింటినీ బాధించిందని, దీంతో అప్పటి నుంచి అవి కుక్కలపై మెరుపుదాడులకు దిగాయని తెలిపారు. ముఖ్యంగా కుక్కపిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తైన బిల్డింగ్ లేదా చెట్ల మీద నుంచి చచ్చేలా విసిరికొట్టడం ఆరంభించాయన్నారు.
అలాగే పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయన్నారు. వీటి దెబ్బకు దాదాపు 250 కుక్కలు ప్రాణాలు పోగొట్టుకున్నాయని, గ్రామంలో కుక్క అన్నది కనిపించకుండా పోయిందన్నారు. కోతుల అరాచకంపై అటవీశాఖకు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిస్థితి చూసినా, కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని గ్రామస్తులు వివరించారు. క్రమంగా కోతులు కేవలం కుక్కలపైనే కాకుండా గ్రామస్తుల పిల్లలపై దాడులకు దిగుతున్నాయని వాపోయారు.
లాక్‌డౌన్ కారణంగా వీటికి సరైన తిండి దొరకకపోవడంతో కోతుల్లో ఆగ్రహం పెరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత సెప్టెంబర్‌లో కర్ణాటకలో ఒక గ్రామంపై పగపట్టిన కోతి 22 కి.మీ.లు ప్రయాణించి ఆ ఊరికి చేరుకొని బీభత్సం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment