గాంధీనగర్: 135 మంది అమాయకులు చనిపోయిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జ్ విషాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణం బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు నియమించిన కాంట్రాక్టర్లేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) ప్రాథమిక దార్యాప్తులో తేలింది. స్థానిక కోర్టుకు సమర్పించిన ఈ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది.
బ్రిడ్జిని పునరుద్ధరించిన కాంట్రాక్టర్లు కేవలం మెటల్ ఫ్లోరింగ్‌ను మాత్రమే మార్చారని నివేదిక పేర్కొంది. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులుగా ఉన్న బోల్టులు, విరిగిన యాంకర్ పిన్స్ వంటి కీలక సమస్యలను పట్టించుకోలేదని తెలిపింది. కొత్తగా వేసిన మెటల్ ఫ్లోరింగ్ వల్ల వంతెన బరువు పెరిగినట్లు వెల్లడించింది. అసలు వంతెన పునరుద్ధరించేందుకు నియమించిన రెండు సంస్థలకు బ్రిడ్జిలకు మరమ్మతులు చేసే అర్హతే లేదనే షాకింగ్ విషయాన్ని నివేదిక బహిర్గతం చేసింది.
నిపుణుడి సలహా తీసుకోకుండానే..
ప్రజల కోసం బ్రిడ్జిని తిరిగి ఓపెన్ చేసే ముందు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఒరెవా గ్రూప్ ఎలాంటి నిపుణుడి సలహా తీసుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. ఘటన జరిగిన అక్టోబర్ 30న ఈ సంస్థ 3,615 టికెట్లను విక్రయించిందని, బ్రిడ్జికి రెండువైపులా ఉన్న బుకింగ్ ఆఫీస్‌ల మధ్య సమన్వయం లేదని చెప్పింది. బ్రిడ్జి కూలినప్పుడు సామర్థ్యానికి మించి 250-300 మంది దానిపై ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ఈ బ్రిడ్జిని రినోవేట్ చేసేందుకు గుజరాత్‌లోని ధ్రాగధ్రాకు చెందిన దేవ్ ప్రకాశ్ సోల్యుషన్ సంస్థను నియమించింది ఒరెవా సంస్థ. ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలను ఒరెవానే చూసుకుంటోంది. మరమ్మతులు చేసినప్పుడు బ్రిడ్జి మెటల్‌ను మాత్రమే మార్చామని దేవ్ ప్రకాశ్ సొల్యూషన్స్ కోర్టులో అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు అధికారులు. వీరిలో ఒరెవా గ్రూప్ మేనెజర్లు దీపక్ పర్కేష్, దినేశ్ దావే సహా ఈ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు. దేవ్ ప్రకాశ్ సొల్యూషన్ సంస్థ ఓనర్లు ప్రకాశ్ పర్మార్, దేవంగ్ పర్మార్ కూడా అరెస్టయ్యారు. వీరంతా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ఇవ్వాల్సి ఉంది.
చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు..
Comments
Please login to add a commentAdd a comment