
కోల్‌కత్తా: రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఉందని.. కదలేకపోతున్నామని.. అసహనంతో అనవసరంగా హారన్ మోగిస్తున్నారా.. ఇలా చేస్తే ఇకపై తప్పదు భారీ మూల్యం. అవసరం లేకున్నా హారన్ మోగించారని 615 మంది వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు రూ. 2 వేలు జరిమానా విధించారు. ఈ ఆసక్తికర ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌండ్ పొల్యూషన్‌ను నివారించేందుకు, వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించే ఉద్దేశ్యంతో, యాంటీ-హాంకింగ్ డ్రైవ్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది జూలై నుంచి కోల్‌కత్తా నగరంలో ప్రత్యేక యాంటీ-హాంకింగ్ డ్రైవ్‌లు చేపడుతున్నట్టు వెల్లడించారు. జూలై నెలలో ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్ వద్ద, ఆసుపత్రుల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా కేవలం 12 రోజుల్లోనే 1,264 వాహనదారులకు జరిమానా విధించినట్టు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యాంటీ పొల్యూషన్ సెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
తాజగా యాంటీ-హాంకింగ్ డ్రైవ్‌లో భాగంగా ఫిబ్రవరి నెలలో ట్రాఫిక్ పోలీసులు రోజుకు సగటున 22 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అధిక సంఖ్యలో వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తూ హారన్ మోగిస్తుండటం గమనించినట్టు తెలిపారు. దీంతో వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచేందుకే 615 మంది వాహనదారులకు రూ. 2వేల చొప్పున జరిమానా విధించినట్టు ట్రాఫిక్ డీసీ అరిజిత్ సిన్హా పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో ట్రాఫిక్ భారీగా తగ్గిపోయి.. సౌండ్ పొల్యూషన్ తగ్గినట్టు పోలీసులు తెలిపారు. కరోనా రూల్స్ ఎత్తేయడం, సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకోవడంతో మళ్లీ సౌండ్ పొల్యూషన్ పెరుగుతున్నట్టు చెప్పారు. దీంతో వాహనదారులపై ఫోకస్ పెంచినట్టు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment