
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు శుక్రవారం పార్లమెంట్‌లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయగా 18 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించగా మరికొన్ని పక్షాలు హాజరయ్యాయి. అయితే ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీ మాత్రం నిరసన తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు గళమెత్తాడు. ప్లకార్డ్ ప్రదర్శించి రైతుల పోరాటానికి మద్దతు పలికాడు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడంతో ఎన్డీఏ నుంచి రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ బయటకు వచ్చింది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతూ పార్లమెంట్‌లో కూడా ఆందోళన కొనసాగించింది. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎంపీ హనుమాన్ బెనివాల్ రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా సభలోనే డిమాండ్ చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సభలో ప్లకార్డు పట్టుకుని దిగిన ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంపై కేంద్ర మంత్రులు తప్పుపట్టారు.