president speech
-
నీట్ పేపర్ లీక్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 18వ లోక్‌సభ కొలువుదీరడంతో.. ఆనవాయితీ ప్రకారం గురువారం ఉదయం ఆమె పార్లమెంట్‌కు విచ్చేసి ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి తన ప్రసంగం వినిపించారు. అదే సమయంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ విజయాలను, రాబోయే ఐదేళ్ల కాలపు లక్ష్యాలను.. పలు కీలకాంశాలను ఆమె తన ప్రసంగం ద్వారా చదివి వినిపించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా (లోక్‌సభ సభ్యులు) సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్ముకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కన్పించింది. శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు రూ.3.20లక్షల కోట్లు ఇచ్చాం. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా భారత్ ఉత్పత్తులు అందిస్తోంది. ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కింద సేవలు కల్పిస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. నారీమణుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఈ రంగంలో భారీగా పెట్టబడులు పెట్టాం. ప్రపంచ వృద్ధిలో భారత్ 15శాతం భాగస్వామ్యం అవుతోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోంది. పౌర విమానయాన రంగంలో పలు మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించింది. బ్యాంకుల క్రెడిట్ బేస్ పెంచి వాటిని బలోపేతం చేశాం. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. మన బలగాలు స్వయంసమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించింది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు విభజన శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా మనమంతా తీవ్రంగా ఖండించాలి. పేపర్ లీకేజీ అంశంపైనా.. ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముర్ము తెలిపారు.అంతకు ముందు.. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి ప్రథమ పౌరురాలు ప్రసంగం చేశారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. ప్రధాని మోదీ ఎంపీలను రాష్ట్రపతి ముర్ముకు పరిచయం చేశారు. -
Parliament Budget Session: కాంగ్రెస్‌కు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయిందని, ఆ పార్టీకి వారంటీ లేదని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఉత్తరం, దక్షిణం అంటూ రెండుగా విభజించానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ బుధవారం సమాధానమిచ్చారు. దాదాపు 90 నిమిషాలపాటు మాట్లాడారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్లో ఇదే ఆయన చివరి ప్రసంగం కావడం విశేషం. కేంద్రంలో తాము వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పునరుద్ఘాటించారు. ‘మోదీ 3.0 ప్రభుత్వ’ హయాంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్ల తమ విజన్‌ను ఆవిష్కరించారు. వికసిత భారత్ పునాదిని పటిష్టం చేస్తామని ప్రకటించారు. మోదీ 3.0 సర్కారు ఏర్పాటు ఇక ఎంతోదూరంలో లేదని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన కాంగ్రెస్ ‘‘దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ ఎప్పటికీ వ్యతిరేకమే. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లేకపోతే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు దక్కేవే కావు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పట్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటే ప్రభుత్వ పరిపాలన దెబ్బతింటుందని నెహ్రూ చెప్పారు. ఓబీసీలకు కాంగ్రెస్ ఎప్పుడూ పూర్తిస్థాయి రిజర్వేషన్లు ఇవ్వలేదు. జనరల్ కేటగిరీలోని పేదలను కూడా పట్టించుకోలేదు. భారతరత్న పురస్కారానికి అంబేడ్కర్ అర్హుడని కాంగ్రెస్ భావించలేదు. సొంత కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డులు ఇచ్చుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. అలాంటి పార్టీ ఇప్పుడు మాకు నీతిపాఠాలు బోధిస్తోంది. మన దేశ భూభాగాలను శత్రు దేశానికి అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత భద్రతపై మాకు ఉపన్యాసాలు ఇస్తోంది. ఆ పార్టీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని గొంతుకోసి చంపేసింది. ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాత్రికి రాత్రే కూలదోసింది. వికసిత భారత్.. మా అంకితభావం కాంగ్రెస్ పాలనలో దేశం సమస్యల వలయంలో చిక్కుకుంది. వాటి పరిష్కారానికే ప్రధానిగా నా రెండు టర్ములను వెచ్చించాను. వికసత భారత్ ఒక పదం కాదు. అది మా అంకితభావం. సబ్కా సాత్ అనేది నినాదం కాదు. అది మోదీ ఇస్తున్న గ్యారంటీ. వారంటీ తీరిపోయినవారు చెప్పే మాటలను దేశం వినిపించుకోదు. గ్యారంటీ బలాన్ని చూపించినవారినే దేశం విశ్వసిస్తుంది. అన్ని వర్గాల సంక్షేమానికి పదేళ్లుగా కృషి ‘యువరాజు’ (రాహుల్)ను స్టార్టప్‌గా తయారు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ, ఆయనొక నాన్–స్టార్టర్. ఎంత లిఫ్ట్ చేయాలని చూసినా ఫలితం ఉండడం లేదు. కాంగ్రెస్ ఆలోచనావిధానానికి కాలం చెల్లింది. అందుకే ఆ పార్టీ పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు. కాంగ్రెస్ నానాటికీ దిగజారిపోతుండడం మాకూ బాధగానే ఉంది. సొంత పార్టీ నేత పట్ల గ్యారంటీ లేని కాంగ్రెస్ మోదీ గ్యారంటీని ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదం. పదేళ్ల యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగే దీన్ని అంగీకరించారు. దేశ సమస్యలేమిటో తెలిసినా వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ఏనాడూ కృషి చేయలేదు. బ్రిటిష్ పాలన నుంచి స్ఫూర్తి పొంది బానిసత్వపు గుర్తులను దశాబ్దాల పాటు కొనసాగించింది. మేము అధికారంలోకి వచ్చాక సమస్యల సుడిగుండం నుంచి దేశాన్ని బయటపడేశాం. మా గళానికి ప్రజలు బలమిచ్చారు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశమంతటా 40 సీట్లు కూడా రావన్న సవాలు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది. ఇప్పుడున్న 40 సీట్లను కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నా. విపక్షాల ప్రతి మాటను మేం చాలా సహనంతో వింటున్నాం. కానీ, మేము చెప్పేది ప్రతిపక్షాలు వినడం లేదు. మా గళాన్ని మీరు అణచివేయలేరు. దానికి దేశ ప్రజలు చాలా బలమిచ్చారు’’. దయచేసి ఆ భాష మానుకోండి ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. భారత్‌ను ఉత్తర, దక్షిణంగా ముక్కలు చేయడానికి కొత్తకొత్త ప్రకటనలు చేస్తోంది. ఉత్తరం, దక్షిణం అనే విభజన రేఖ తీసుకురావడం కాంగ్రెస్, కర్ణాటక ప్రభుత్వం మానుకోవాలి. దేశ భవిష్యత్తుతో చెలగాటం వద్దు. ‘మా పన్నులు, మా డబ్బులు’ అంటూ మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఇలాంటి భాష బాధగా ఉంది. దయచేసి ఆ భాష మానుకోండి. దీనివల్ల దేశానికి నష్టం తప్ప లాభం ఉండదు. దేశమంటే కొన్ని భూభాగాల సమ్మేళనం కాదు. ఒక అంగం పనిచేయకపోతే శరీరమంతా స్తంభిస్తుంది. అలాగే దేశంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేస్తే దేశమంతా అభివృద్ధి చెందలేదు’’. -
‘అవినీతిపై కేంద్రం నిరంతరం పోరాడుతోంది’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగాన్ని ద్రౌపది ముర్ము.. పార్లమెంట్ సభ్యుల సాక్షిగా దేశానికి వినిపించారు. ఈ క్రమంలో దేశం అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్న ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్నది ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది. వన్ నేషన్ వన్ రేషన్ మంచి కార్యక్రమం. భారత్ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పెద్ద భరోసా. పేదల ఉపాధి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. మూడు కోట్ల మంది పేదలకు కేంద్రం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మూడేళ్లలో 11 కోట్ల మందికి ఇంటింటికీ మంచినీరు అందించింది. దేశ ప్రజలకు కోవిడ్ నుంచి విముక్తి కల్పించింది ప్రభుత్వం. నిరుపేద కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అన్ని విధాలుగా కోవిడ్ కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేసింది. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాళ్ల అభివృద్ధికి పాటుపడుతోంది. ఓబీసీల సంక్షేమం కోసం కీలక ముందడుగు వేసింది. గిరిజన నేతలకు మంచి గుర్తింపు లభిస్తోంది. బాగా వెనుకబడిన గ్రామాలను కేంద్రం అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. భేటీ బచావ్-భేటీ పడావ్ నినాదం ఫలితాన్నిచ్చింది. దేశంలో తొలిసారిగా మహిళల సంఖ్య పెరిగింది. పీఎం ఆవాస్ యోజన పథకం సత్ఫలితాలు ఇచ్చింది. బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. అంతరిక్ష ప్రయోగాలతో భారత్ అత్యద్భుత ప్రగతి సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అతిపెద్ద శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ ఫార్మా హబ్‌గా భారత్ ఎదుగుతోందని కొనియాడారామె. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పొరుగు దేశాల సరిహద్దుల్లోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. దేశంలో అవినీతిపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తన ప్రసంగంలో కేంద్రంపై ప్రశంసలు గుప్పించారామె. -
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు రామ్‌నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సంస్కృతి నేటి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కాన్పుర్ దేహాత్ జిల్లా పరౌఖ్ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరినట్లు కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన శాయశక్తుల మేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. తనకు సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సోమవారం ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: ఉద్ధవ్ థాక్రేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. ఆయన తలరాత ఆ రోజే ఖరారైంది -
లోక్‌సభ టాప్ గేర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై చర్చలు మొదలుకుని బిల్లుల ఆమోదం తదితర అన్ని అంశాల్లోనూ ప్రస్తుత లోక్‌సభ చక్కని పనితీరు కనబరుస్తోంది. చర్చల నిడివి, వాటిలో పాల్గొన్న సభ్యుల సంఖ్యతో పాటు ఆమోదించిన బిల్లుల విషయంలోనూ 14, 15, 16వ సభలతో పోలిస్తే ప్రస్తుత 17వ లోక్‌సభ మెరుగ్గా రాణించింది. అన్నింటా ముందే... 17వ లోక్‌సభ 2019 మే 25న కొలువుదీరింది. జూన్ 17న తొలి సమావేశం జరిగింది. మూడేళ్లలో ఎనిమిదిసార్లు సమావేశమైంది. ఎన్నో అరుదైన రికార్డులు సాధించింది. ఏకంగా 995 గంటల పాటు కార్యకలాపాలు జరిపింది. అవి ఎన్నోసార్లు అర్ధరాత్రి దాకా కొనసాగాయి. ఆ లెక్కన 106 శాతం ఉత్పాదకత సాధించింది. ఇది 16వ లోక్ సభ కంటే 11 శాతం, 15వ సభ కంటే 35 శాతం ఎక్కువ! 15వ సభలో చర్చలకు తీసుకున్న సగటు సమయం 85 నిమిషాలు, పాల్గొన్న సభ్యుల సంఖ్య 921 కాగా ఈ సభలో సగటు సమయం 132 నిమిషాలకు పాల్గొన్న సభ్యుల సంఖ్య ఏకంగా 2,151కి పెరగడం విశేషం. రాష్ట్రపతి ప్రసంగంపై 14వ సభలో 266 మంది సభ్యులు మాట్లాడగా ఈసారి 518 మందికి పెరిగింది. సభ్యులు 377 రూల్ కింద 3,099, జీరో అవర్‌లో 4,648 అంశాలు ప్రస్తావించారు. టెక్నాలజీ వాడకంతో రూ.668.86 కోట్లు ఆదా చేసింది. స్టాండింగ్ కమిటీలు 419 సమావేశాలు జరిపి 4,263 సిఫార్సులు చేశాయి. 2,320 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. కొత్తవారికి ప్రోత్సాహం మూడేళ్ల సభా కార్యకలాపాలు పూర్తి తృప్తినిచ్చాయి. చర్చలు గతంకన్నా మెరుగ్గా జరిగాయి. కొత్త సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశాలిచ్చాం. ఎన్నోసార్లు సభా సమయాన్ని పొడిగించి ప్రత్యేక ప్రస్తావనల అంశాలకు చాన్సిచ్చాం. పార్లమెం ట్ కొత్త భవన నిర్మాణం చకచకా సాగుతోంది. ఈ ఏడాది శాతాకాల సమావేశాలు అందులోనే జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం – స్పీకర్ ఓం బిర్లా -
రైతుల ఉద్యమం పవిత్రమైనదే.. కానీ: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు చేస్తోన్న ఉద్యమం పవిత్రమైనదే కానీ.. ఆందోళన జీవి వల్ల అది దారి తప్పుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ.. వివిధ అంశాలపై సుధీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా రైతుల ఉద్యమానికి సంబంధించి మోదీ చేసిన ఆందోళన జీవి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతుండటంతో ఆయన దీనిపై స్పందించారు. ‘‘రైతుల చేస్తోన్న ఉద్యమం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆందోళన జీవులు రైతుల ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. వారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను.. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని, నక్సల్స్‌ను, ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ ఆందోళన జీవులు రైతులకు మేలు చేసే వారు ఎలా అవుతారు’’ అని మోదీ ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఆందోళన ముఖ్యం. కాని జనాలు ప్రజాస్వామ్యం, నిజమైన ఆందోళనకారుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. పంజాబ్‌లో మొబైల్ టవర్లను ధ్వంసం చేయడం ఏంటి.. వ్యవసాయ చట్టాలతో దానికి సంబంధం ఏంటి’’ అని మోదీ ప్రశ్నించారు. ప్రైవేట్ రంగం కూడా కీలకమే ‘‘ప్రభుత్వ రంగం అనివార్యమే ఒప్పుకుంటాను. కానీ అదే సమయంలో ప్రైవేట్ రంగం కూడా కీలకమే’’ అని ప్రధాని పేర్కొన్నారు. టెలికాం, ఫార్మా సహా ఏ రంగం తీసుకున్నా ప్రైవేట్ రంగం పాత్ర విస్మరించలేమని తెలిపారు. ప్రైవేట్ రంగాన్ని కించపరుస్తూ మాట్లాడే సంస్కృతికి కాలం చెల్లిందన్నారు. గతంలో ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని పార్టీలకు ఓట్లు పడేవి. కానీ ఇప్పుడా రోజులకు కాలం చెల్లిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులతో సేద్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రయోజనమే తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదని మోదీ స్పష్టం చేశారు. చదవండి: ప్రధాని మోదీకి చిదంబరం గట్టి కౌంటర్ హలధారులే కానీ.. హంతకులు కారు -
మన బలం ప్రపంచానికి చూపించాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పోరాటంలో భారత్ ప్రదర్శించిన స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ విపత్తును భారత్ ఎదుర్కున్న తీరు ప్రసంశనీయమని, ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని అన్నారు. దేశం మరింత బలపడటానికి కరోనా వైరస్ బాటలువేసిందన్నారు. మన బలమేంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. లాక్డౌన్సమయంలో కరోనా వారియర్స్ చేసిన సేవ వర్ణించలేనిదని వారి సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతోందని వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియనలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతగా ఎదుర్కొందని, కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ టీకా అభివృద్ధిలో మనదేశ శాస్త్రవేత్తలు పోషించిన పాత్ర వర్ణించలేనిదని కొనియాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ‘కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలిచాం. అనేక దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిస్తున్నాం. ప్రపంచ ఫార్మా హబ్‌గా భారత్ ఎదుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ భారత్‌లో కొనసాగుతోంది.. మన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది. నూతన అవకాశాల నిలయంగా భారత్ మారుతోంది. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. అనేక అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. కనిపించని మహమ్మారి కరోనా. కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతున్నాం. దేశానికి కరోనా వారియర్స్ చేసిన సేవలు మరువలేనివి. సంక్షోభం కారణంగా భారత్ మరింత బలపడింది. ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు పడేలా చేసింది. కరోనాపై విజయం ప్రభుత్వానిది కాదు.. ప్రజలందరిది. మానవాళి రక్షణకు భారత్ కృషిని ప్రపంచమంతా ప్రశంసిస్తోంది’ అని అన్నారు. సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకం అన్నారు. సభ్యులంతా అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షం బహిష్కరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రైతు దీక్షలను ప్రస్తావించారు. కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. -
'రాష్ట్రపతి ప్రసంగానికి సవరణను ప్రతిపాదిస్తున్నాం'
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సవరణలను ప్రతిపాదిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూనే ఆయన తమ పార్టీ ప్రతిపాదించిన సవరణ వివరాలను వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వేజోన్, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లాంటి ప్రధాన డిమాండ్లను ప్రతిపాదించారు. అలాగే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, జాతీయ వ్యవసాయ కమిషన్ ఏర్పాటుకు ప్రైవేట్ బిల్లు పెడుతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నదులు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆయన స్పందిస్తూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, మొదటి నుంచి ఆయన ధోరణి సరిగా లేదని ఆరోపించారు. గతంలో కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కరోనా సాకు చూపి ఎన్నికలు నిలిపివేశారని, ఇప్పుడు కరోనా ముప్పు తగ్గక పోయినా ఎన్నికలంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. అత్యుత్తమ రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ, ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయన్న విషయం 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలీదా అని ప్రశ్నించారు. కనీస అవగాహన లేని వ్యక్తిలా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను ఎలా విడుదల చేస్తారని ఆయన చంద్రబాబును నిలదీశారు. 2024కు పార్టీ ఉండదనే భయంతోనే, చంద్రబాబు ఇవి చివరి ఎన్నికలుగా భావించి పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశారని ఎద్దేవా చేశారు. విధులను అలక్ష్యం చేశారంటూ అధికారులపై చర్యలు తీసుకుంటున్న ఎస్ఈసీ.. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్రముఖిగా మారి వ్యవస్థలోకి ప్రవేశించారని ఆయన ఎద్దేవా చేశారు. 2018లో జరగాల్సిన ఎన్నికలను నాడు ఎందుకు నిర్వహించలేదో, ఎస్ఈసీ నిమ్మగడ్డ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మేలు చేసే విధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న నిమ్మగడ్డ.. ఐఏఎస్‌లతో పాటు ఉన్నతాధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎక్కడ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలీని నిమ్మగడ్డ.. రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
ఒకే ఒక్కడు: రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డగించిన ఎంపీ
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు శుక్రవారం పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయగా 18 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించగా మరికొన్ని పక్షాలు హాజరయ్యాయి. అయితే ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీ మాత్రం నిరసన తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు గళమెత్తాడు. ప్లకార్డ్ ప్రదర్శించి రైతుల పోరాటానికి మద్దతు పలికాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడంతో ఎన్డీఏ నుంచి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ బయటకు వచ్చింది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతూ పార్లమెంట్లో కూడా ఆందోళన కొనసాగించింది. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎంపీ హనుమాన్ బెనివాల్ రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా సభలోనే డిమాండ్ చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సభలో ప్లకార్డు పట్టుకుని దిగిన ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంపై కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. -
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ దేశ రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు కాంగ్రెస్ సహా 18 ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్(ఎం), ఏఐయూడీఎఫ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘దేశ జనాభాలో 60 శాతం ప్రజలు, కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడిన వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ప్రమాదకరంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా రుద్దుతున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంఘటితంగా రైతులు పోరాడుతున్నారు. గడిచిన 64 రోజులుగా తీవ్రమైన చలిని, భారీ వర్షాలను లెక్కచేయకుండా దేశ రాజధానిలో రైతులు తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నారు. సుమారుగా 155 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వంలో కదలిక లేకపోగా.. వాటర్ కెనాన్లతో, టియర్ గ్యాస్‌తో, లాఠీఛార్జీలతో జవాబు ఇచ్చింది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని ప్రభుత్వ ప్రాయోజిత తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశ ఆహార భద్రత స్వరూపం ముక్కలవుతుంది.. ‘మూడు సాగు చట్టాలు రాష్ట్రాల హక్కులపై, రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై దాడి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోనిపక్షంలో అవి దేశ ఆహార భద్రత స్వరూపాన్ని ముక్కలు చేస్తాయి. అంతేకాకుండా కనీస మద్దతు ధర, ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తాయి’ అని పేర్కొన్నాయి. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.. ‘ప్రధాని, బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మాకు దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్ల మేం సంఘటితంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నాం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాం’ అని కాంగ్రెస్‌సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. -
లోక్‌సభలో మోదీ మాటల తూటాలు..
సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లకు భారతరత్న పురస్కారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తమ ప్రభుత్వం భారతరత్నతో గౌరవించిందని గుర్తుచేశారు. ఇందిర హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి దేశ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆమె పాలనా కాలంలో భారత్‌ను పెద్ద జైలుగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ నేలవిడిచి సాము చేసిందని.. మన్మోహన్ సింగ్ పాలనను కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ పొగడలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి పాలనపై కనీస అవగహాన లేదని.. ఇతర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వారు గుర్తించలేదని ధ్వజమెత్తారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని అన్నారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అప్పగించినందుకు ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల, మహాపురుషుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మోదీ స్పష్టం చేశారు. నూతన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమర్థవంతంగా సభను నడుపుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష సభ్యులు చేసిన సలహాలను స్వీకరిస్తామని ప్రకటించారు. సభలో మోదీ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఆయన మాటలను ఆమోదిస్తూ.. బల్లలు చరుస్తూ.. సభ్యులంతా పూర్తి సంఘీభావం తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశానికి సేవచేసేందుకు అనేక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నామని, దేశ ప్రగతి కోసం అనేక విధాలుగా ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని, ఓటు వేసేముందు ప్రజలు అనేక విధాలుగా ఆలోచించి తమకు ఓటు వేశారని మోదీ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ముఖ్యంకాదని, దేశ అభివృద్ధికి విపక్షాలు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. ప్రతి పౌరుడు తన హక్కుల కోసం పోరాడాలి. మా ప్రభుత్వం పేదవారందరికీ అంకితమని 2014లోనే స్పష్టం చేశాం. వారికిచ్చి అనేక హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. పేదరిక నిర్మూలనకు మరింత కృషి చేస్తాం. రోడ్ల నుంచి అంతరిక్షం వరకూ గడిచిన ఐదేళ్లలో దేశం ఎన్నో లక్ష్యాలను చేరుకుంది‘‘ అని అన్నారు. -
‘వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి వంటిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి తప్పక ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ఈవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మూలంగానే రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను వైఎస్సార్సీపీ 22 ఎంపీ సీట్లు గెల్చుకుందని తెలిపారు. -
ప్రతి ఒక్కరికీ సాధికారతే లక్ష్యం
న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. 2014లో ప్రారంభమైన నిరంతర, నిరాటంక అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రజలు గట్టి తీర్పునిచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఈ సాధారణ ఎన్నికలు పెంపొందించాయన్నారు. రికార్డు స్థాయిలో 61 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, వీరిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్ సుమారు గంటసేపు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని అన్నారు. ఎప్పుడూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటం అభివృద్ధి కార్యక్రమాల వేగం, కొనసాగింపుపై ప్రభావం చూపిస్తోందన్నారు. అందువల్ల ఎంపీలందరూ ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు. లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోందన్నారు. భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోందంటూ మెరుపు దాడులను, పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులను రాష్ట్రపతి ప్రస్తావించారు. తొలుత మెరుపుదాడులతో, ఆ తర్వాత పుల్వామా దాడి నేపథ్యంలో సరిహద్దు పొడవునా ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సురక్షితమైన, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమానికి చర్యలు నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులు, చిరు వ్యాపారులకు పింఛను పథకాలు ప్రారంభించేందుకు, రైతులందరికీ రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా గత ఐదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాల నిర్మూలన మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపే విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నల్లధన వ్యతిరేక కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకువెళతామన్నారు. గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంపెనీ డైరెక్టరపై అనర్హత వేటు వేశామని, 3 లక్షల 50 వేల అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలన్నీ ప్రస్తుతం దేశానికి అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ విధానాన్ని, స్ఫూర్తిని బలోపేతం చేసేలా దేశ ప్రయోజనాల సాధనకు తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోతోందని చెప్పారు. ప్రసంగం సైడ్‌లైట్స్ ► ప్రసంగ సమయంలో కావేరీ జలాల సమస్యను తీర్చాలంటూ డీఎంకే పార్టీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ► రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ను, రఫేల్ అంశం గురించి ప్రసంగిస్తున్నపుడు ఎన్డీయే సభ్యులు చప్పట్లు చరిచారు. ► ప్రసంగసమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు ఎంపీలు మొబైల్ ఉపయోగించడం కెమెరాల కంటపడింది. ► రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సభ్యులు పలువురు రాహుల్‌గాంధీని కలిశారు. సెంట్రల్ హాల్ నుంచి బయటకు వస్తూ సోనియా గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలకరించుకున్నారు. కోవింద్ ఏడాదిలో ఇది రెండోసారి రాష్ట్రపతి కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. క్రీమ్ కలర్ జోధ్‌పురి సూట్ (బంద్గలా) ధరించిన కోవింద్ అశ్విక దళం ముందూ వెనుకా నడుస్తుండగా బగ్గీలో కాకుండా కార్లో పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అంతకుముందు తన వ్యక్తిగత అంగరక్షకుల (పీబీజీ) గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి భవనం వెలుపల అశ్విక దళం (పీబీజీ) రాష్ట్రపతి వెంట ఉండటం అరుదుగా కన్పిస్తుంది. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు రాజధాని వాసులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఏడాది ఇలా జరగడం నాల్గోసారి. -
సైనిక సంప్రదాయాన్ని మార్చిన ‘బీటింగ్ రిట్రీట్’
ఆదిత్య హృదయం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం, ఎకనమిక్ సర్వే తర్వాత బీటింగ్ ద రిట్రీట్ (సైనిక సంరంభోత్సవం) గురించి తెలుసుకోవడానికి మీకు సమయం లేకపోతే, మీరు కోల్పోయింది ఏదీ లేదని నేను నొక్కి చెబుతాను. ప్రతి ఏడాదిలాగే ఈసారీ నేను దాన్ని తిలకించటానికి ప్రయత్నించాను కానీ పూర్తిగా అసంతృప్తి, ఆశాభంగం కలిగించింది. పైగా అసహ్యం వేసింది కూడా. బీటింగ్ ద రిట్రీట్ ఎప్పుడూ నాకు ఇష్టమైన కార్యక్రమంగా ఉంటూ వచ్చింది. ఇది ఏ ప్రమేయం లేకుండానే మనతో డ్యాన్స్ చేయించే సంగీతంతో, అత్యంత నిర్దిష్టమైన మార్చింగ్తో కూడిన సంరంభోత్సవం. కార్యక్రమం చివర్లో ప్రదర్శించే లేజర్ లైటింగ్ మిరిమిట్లు గొలుపుతుంది. కాని ఈ అన్ని అంశాల్లోనూ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఘోరంగా తయారైంది. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపర్చామని భావిస్తున్న వ్యక్తులు నిజానికి దాని హృదయాన్ని తూట్లు పొడిచేశారు. నా స్నేహితుడు, బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో స్ట్రాటెజిక్ ఎఫైర్స్ ఎడిటర్ కల్నల్ అజయ్ శుక్లా ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోయే ‘ట్వీటింగ్ రిట్రీట్’ శీర్షికతో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ‘సైనిక ఉత్సవానికి వీరేం చేశారో నాకు తెలీదు. డ్రమ్మర్ల డ్యాన్సింగ్, సితార్ ప్లేయర్లు, సంగీతం అన్నీ ఉన్నాయి కానీ మిలిటరీకి సంబంధించిన స్పృహ లేకుండా చేశారు. అర్థరహితమైన మార్పులతో ఒక గొప్ప సంప్రదాయాన్ని బలిపెట్టడానికి సైనికాధికారులు ఎలా అనుమతించారో చూస్తుంటే విచారమేస్తుంది!’ బాధ్యతారహితమైన మన సైనిక జనరల్స్ బీటింగ్ ద రిట్రీట్ ఒక సంప్రదాయమని, నిరంతర కొనసాగింపే దాని ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయారు. పూర్తిగా పతనమయ్యే స్థాయికి దాన్ని మార్చేశారు. ఈ విశిష్ట సైనిక సంప్రదాయం 1690లో ప్రారంభమైంది. ఇంగ్లండ్ చక్రవర్తి జేమ్స్–ఐఐ యుద్ధం ముగిసిన రోజు చివరలో సైనిక దళాలు వెనక్కు వచ్చే సందర్భంగా సైనిక వాయిద్యాలను మోగించాలని ఆదేశించాడు. కాబట్టి అది ఒక ముగింపుకు సంబంధించిన సమ్మేళనం. అంతిమ పరిణామానికి అది చిహ్నం. ఇది పూర్తిగా సైనిక సంరంభ కార్యక్రమం. శతాబ్దాలుగా బీటింగ్ ద రిట్రీట్ ఒక అత్యద్భుతమైన సంగీతం, అత్యంత నిర్దిష్టంగా సాగే మిలిటరీ డ్రిల్‌కు మారుపేరుగా ఉంటూ వస్తోంది. చక్కటి పొందికతో పాదాలను కదపడమే ఈ మ్యూజికల్ మార్చ్ విశేషం. విషాదమేమిటంటే, గత సోమవారం ఈ కార్యక్రమాన్ని భారతీయులే కంపోజ్ చేసి ఉండవచ్చు కానీ వాళ్లు అసలైన కవాతును మాత్రం చేయించలేదు. రెండు. ఈ కార్యక్రమం కోసం వాడే సంగీత వాయిద్యాలు సాంప్రదాయిక మిలిటరీ బ్యాండ్‌కు సంబంధించినవిగానే ఉండాలి. అందరూ ఇష్టపడే సితారకు ఈసారి వారు చోటు ఇవ్వలేదు. వచ్చే ఏడాదికి వారు షెహనాయ్‌ని పరిచయం చేస్తారా? మూడు. బ్యాండ్ తప్పకుండా సంగీతానికి అనుగుణంగా మార్చ్ చేయాలి లేదా డ్రిల్ చేయాలి. సమర్థవంతమైన డ్రమ్మింగ్ మెప్పించవచ్చు కానీ దాన్ని సరైన విధంగా మేళనం చేయలేదు. ఇలాంటి సంగీతంతో మీరు మార్చ్ చేయలేరు. పైగా జాజ్ సంగీ తాన్ని పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నం అయితే మరీ అసంబద్ధంగా కనిపించింది. నేను 1960లు, 70లు, 80ల నాటి బీటింగ్ రిట్రీట్స్ను గుర్తు తెచ్చుకున్నాను. అవి శ్రోతలకు దిగ్భ్రమ కలిగించేవి. బ్యాండ్లు కూడా మేటి సంగీతంతో అలరించేవి. బాలీ వుడ్ అనుకరణలను పక్కనబెడితే సైనిక కవాతు నిజానికి అలాంటి ప్రభావం కలిగిస్తుంది మరి. చివరగా, సూర్యుడు దిగంతంలోకి జారుకుంటున్నవేళ, సాయంవేళ దీపకాంతులను ప్రతిబింబించేది. రైసినా హిల్స్ విద్యుద్దీపాలతో మెరిసిపోయేది. ప్రతి ఒక్కరూ ఆ క్షణం తీసుకువచ్చే ఆకస్మిక వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. కానీ ఈ సంవత్సరం వారు లైటింగ్ కూడా మార్చేశారు. జాతీయ పతాక రంగులను ప్రతిబింబించే లైటింగ్‌లో దిగ్భ్రమ కలిగించే ప్రభావం లేకుండా పోయింది. కొత్త లైటింగ్ చీకటిలో మెప్పించవచ్చు కానీ సాయంత్రం ప్రారంభంలో అది కలిగించే ప్రభావం పెద్దగా ఉండదు. మీరు ఊహించే పతాకదశను ప్రదర్శించడంలో అది మిమ్మల్ని వంచిస్తుంది అంతే. కాని ‘అబైడ్ విత్ మి’, ‘సారే జహాసె అచ్ఛా’ గీతాలాపనతో వారు కాస్త దయ చూపినందుకు నేను కృతజ్ఞుడిని. వీటిని కూడా వారు ఉపసంహరిస్తారేమోనని నేను భావించాను. ఎందుకంటే మొదటి గీతం క్రిస్టియన్ కీర్తన. చివరి గీతాన్ని స్వరపర్చింది పాకిస్తాన్ సంస్థాపకులలో ఒకరు. ఈ సంవత్సరానికి మటుకు ఈ రెండూ బతికిపోయాయి మరి. మొత్తంగా నా అభిప్రాయం చాలా సరళమైంది. సంప్రదాయానికి విలువ ఇవ్వని దేశం తన గతాన్ని గౌరవించదు, పైగా అది విలువ ఇచ్చే జాతీయ మనోభావాలను కూడా పలుచన చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ మీరు మార్చకూడని కొన్ని విషయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు వాటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఉండాలి. బీటింగ్ రిట్రీట్ అలాంటి అంశాల్లో ఒకటి. - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
అంశాలవారీగా మా మద్దతు ఉంటుంది...
- పజలకు ఇబ్బంది కలిగే అంశాలను ఎత్తిచూపుతాం - రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో - వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు మేలుచేసే పనుల్లో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ తరఫున అంశాలవారీగా మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాల్లో వేలెత్తి చూపుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై కేంద్రం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానం మీద గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో వరప్రసాద్ మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్, మేక్ ఇన్ ఇండియా, జన్‌ధన్ యోజన, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే స్కిల్ ఇండియా, ఆడ పిల్లలకు విద్యనందించే ఉద్దేశంతో చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అదేవిధంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా ప్రవేశపెట్టిన నీతిఆయోగ్‌ను అభినందించారు. అయితే కొన్ని అంశాల్లో ఎన్నో లోపాలున్నాయని పేర్కొన్నారు. దేశంలో దాదాపు 30 శాతం మంది దళితులు, 50 శాతం మంది బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని, దేశ అభివృద్ధి కేవలం 20 శాతం మంది జనాభాకే చేరుతున్నదని అన్నారు. పేదలు గౌరవంగా బతికేలా వారి ఆర్థికస్థితిని మార్చేలా పథకాలను రూపొందించాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కోరారు. కేంద్రం పారిశ్రామిక అభివృద్ధి పేరిట భూసేకరణ చేపట్టాలని చూస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో యూరప్ తరహాలో భారత్‌లోనూ వ్యవసాయం చేసేవారే లేకపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఏ ఒక్క చర్యా తీసుకోకపోవడం బాధాకరమన్నారు.