అంశాలవారీగా మా మద్దతు ఉంటుంది...
- పజలకు ఇబ్బంది కలిగే అంశాలను ఎత్తిచూపుతాం
- రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో
- వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు మేలుచేసే పనుల్లో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ తరఫున అంశాలవారీగా మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాల్లో వేలెత్తి చూపుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై కేంద్రం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానం మీద గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో వరప్రసాద్ మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్‌భారత్, మేక్ ఇన్ ఇండియా, జన్‌ధన్ యోజన, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే స్కిల్ ఇండియా, ఆడ పిల్లలకు విద్యనందించే ఉద్దేశంతో చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అదేవిధంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా ప్రవేశపెట్టిన నీతిఆయోగ్‌ను అభినందించారు. అయితే కొన్ని అంశాల్లో ఎన్నో లోపాలున్నాయని పేర్కొన్నారు.
దేశంలో దాదాపు 30 శాతం మంది దళితులు, 50 శాతం మంది బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని, దేశ అభివృద్ధి కేవలం 20 శాతం మంది జనాభాకే చేరుతున్నదని అన్నారు. పేదలు గౌరవంగా బతికేలా వారి ఆర్థికస్థితిని మార్చేలా పథకాలను రూపొందించాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కోరారు. కేంద్రం పారిశ్రామిక అభివృద్ధి పేరిట భూసేకరణ చేపట్టాలని చూస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో యూరప్ తరహాలో భారత్‌లోనూ వ్యవసాయం చేసేవారే లేకపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఏ ఒక్క చర్యా తీసుకోకపోవడం బాధాకరమన్నారు.