నీట్‌ పేపర్‌ లీక్‌ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం | Parliament Session: President Murmu Joint Sitting Updates | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీక్‌ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం: పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం

Published Thu, Jun 27 2024 10:52 AM | Last Updated on Thu, Jun 27 2024 1:45 PM

Parliament Session: President Murmu Joint Sitting Updates

న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 18వ లోక్‌సభ కొలువుదీరడంతో.. ఆనవాయితీ ప్రకారం గురువారం ఉదయం ఆమె పార్లమెంట్‌కు విచ్చేసి ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి తన ప్రసంగం వినిపించారు. అదే సమయంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ విజయాలను, రాబోయే ఐదేళ్ల కాలపు లక్ష్యాలను.. పలు కీలకాంశాలను ఆమె తన ప్రసంగం ద్వారా చదివి వినిపించారు. 

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా (లోక్‌సభ సభ్యులు) సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  •  ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్ముకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈసారి కశ్మీర్‌ లోయలో మార్పు కన్పించింది. శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం.
      
  • రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది.
     
  • ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్‌ నిధి కింద ఇప్పటివరకు రూ.3.20లక్షల కోట్లు ఇచ్చాం. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఆర్గానిక్‌ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా భారత్‌ ఉత్పత్తులు అందిస్తోంది.
     
  • ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్‌ భారత్‌ అనేది గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తోంది. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ కింద సేవలు కల్పిస్తున్నాం.
     
  • ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. నారీమణుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఈ రంగంలో భారీగా పెట్టబడులు పెట్టాం.
     
  • ప్రపంచ వృద్ధిలో భారత్‌ 15శాతం భాగస్వామ్యం అవుతోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గ్రీన్‌ ఎనర్జీ సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోంది. పౌర విమానయాన రంగంలో పలు మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
     
  • డిజిటల్‌ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించింది. బ్యాంకుల క్రెడిట్‌ బేస్‌ పెంచి వాటిని బలోపేతం చేశాం. డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరిగాయి.
     
  • సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. మన బలగాలు స్వయంసమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి.
     
  • సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి.
     
  • ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించింది.
     
  • ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు విభజన శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా మనమంతా తీవ్రంగా ఖండించాలి. 


పేపర్‌ లీకేజీ అంశంపైనా.. 
ఇటీవల నీట్, నెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముర్ము తెలిపారు.

అంతకు ముందు.. రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి ప్రథమ పౌరురాలు ప్రసంగం చేశారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. ప్రధాని మోదీ ఎంపీలను రాష్ట్రపతి ముర్ముకు పరిచయం చేశారు. 


  •  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement