ముంబై: ప్రధాని మోదీ నాసిక్ పర్యటనపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నాసిక్‌లోని కాలారామ్ గుడిని సందర్శించడానికి కారణం తామేనని రౌత్ చెప్పారు. తాము ఈ నెల 22న అయోధ్య వెళ్లకుండా కాలారామ్ గుడిని సందర్శిస్తామని ప్రకటించినందు వల్లే టూర్ షెడ్యూల్‌లో లేకున్నాప్రధాని శుక్రవారం ఆ గుడికి వెళ్లారని రౌత్ అన్నారు.
గత ఏడాది మే నెల నుంచి రెండు తెగల పెద్ద ఎత్తున అలర్లు జరుగుతున్న మణిపూర్‌ను ప్రధాని మోదీ ఇంతవరకు సందర్శించలేదని రౌత్ మండిపడ్డారు. శివసేన ముఖ్య నేతలు అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మరొక రోజున రామ్ మందిరాన్ని సందర్శిస్తారని, అనంతరం మణిపూర్ వెళ్లి అక్కడి రామ మందిరంలోనూ పూజలు నిర్వహిస్తారన్నారు.
కనీసం తమ పర్యటన తర్వాతైనా మోదీ మణిపూర్‌కు వెళ్తారని ఆశిస్తున్నట్లు రౌత్ చెప్పారు. శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోదీ మొత్తం రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. వీటిలో కీలకమైన ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ కూడా ఉండటం విశేషం. అయితే వీటిని కూడా మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రారంభిస్తున్నారని శివసేన విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment