తీరా
ముంబై : కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో నగరంలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మిహర్ కామత్, ప్రియాంక కామత్‌ల జంట తమ జీవితాల్లోకి ఓ కొత్త వ్యక్తిని ఆహ్వానించింది. ఆగస్టు 14న ఓ పండింటి ఆడబిడ్డ ‘తీరా’ జన్మించింది. ఆ పాప మొదటి సంతానం కావటంతో ఎంతో సంతోషించింది ఆ జంట. అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. పాపకు ‘స్పైనల్ మస్య్కులర్ అట్రోఫీ’ అనే జన్యుపరమైన లోపం ఉన్నట్లు తెలిసింది. పాపను బ్రతికించుకోవాలంటే జీనీ థెరపీ తప్పని సరైంది. అయితే ఈ చికిత్సకు భారీ మొత్తం 16 కోట్ల రూపాయలు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో కామత్ దంపతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి అంత పెద్ద మొత్తం ఎలా సర్దుబాటు చేయాలో తెలియక, పాపను బ్రతికించుకునే దారి మరోటి లేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వారికున్న సమయం కేవలం మూడు నెలలు మాత్రమే కావటంతో వారి బాధకు అంతులేకుండా పోయింది. దీనిపై పాప తండ్రి మాట్లాడుతూ.. ‘‘ పాప వైద్యం కోసం విరాళాలు సేకరిస్తున్నాము. ఆన్‌లైన్ ద్వారా 2.36 కోట్లు సేకరించాము. దాదాపు 8,187మంది సహాయం చేశారు. పాపకు వైద్యం చేస్తున్న డాక్టర్ నీలు దేశాయ్ ‘స్విట్జర్లాండ్ హెచ్‌క్యూ నోవార్టిస్ ఫార్మా కంపెనీ’ గ్లోబల్ లాటరీలో తీరా పేరును రిజిస్ట్రర్ చేశారు. సదరు కంపెనీ లాటరీ తగిలిన వారికి మందు ఉచితంగా ఇస్తుంది’’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment