
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం పర్యటించారు. సాంగ్లీ నుంచి తన పర్యటనను ప్రారంభించిన ఆయన.. బిల్వాడి ప్రాంతంలో వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్న కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ కల్పిస్తున్న సదుపాయాలు, భోజనం, తాగు నీటి నాణ్యతపై ఆరా తీశారు. ఆ తరువాత సాతారాకు బయలుదేరారు. అక్కడి వరద బాధితులను పరామర్శించారు. ప్రతీ ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టాన్ని తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్క బాధితుడికి ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని, ఆందోళన చెందవ్దని భరోసా కల్పించారు. అయితే, అంతకుముందు పలు కారణాల వల్ల ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తన పర్యటన షెడ్యూల్‌లో మార్పు చేసుకోవాల్సి వచ్చింది. ముందు రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఆయన పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ, సాతారా, కొల్హాపూర్ జిల్లాలలోని పలు గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. కానీ, వాతావరణం అనుకూలంగా లేదని, హెలికాప్టర్ టేకాఫ్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని సాంకేతిక సిబ్బంది చెప్పారు. అంతేగాక, అనేక చోట్ల రోడ్డు మార్గం వరద ఉధృతికి కొట్టుపోయింది. దీంతో రోడ్డు మార్గం మీదుగా వెళ్లడానికి వీలు పడదని అధికారులు చెప్పడంతో అజిత్ పవార్ తన కొల్హాపూర్ పర్యటనను విరమించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment