సాక్షి, ముంబై: ఎన్‌కౌంటర్ స్పెష్టలిస్టుగా పేరొందిన ముంబై పోలీసు శాఖకు చెందిన దయా నాయక్‌ను విదర్భలోని గోందియా జిల్లాకు బదిలీ చేశారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేసినట్లు అప్పర్ పోలీసు డీజీపీ కుల్వంత్ సారంగల్ తెలిపారు. ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తుల గుండెళ్లో దడ పుట్టించిన నాయక్‌పై తరుచూ బదిలీ వేటు పడేది. ఒక్కచోట కూడా ఏడాది లేదా ఏడాదిన్నర కంటే ఎక్కువ కాలం విధులు నిర్వహించలేదు.
ఓ సారి ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో సస్పెండ్ వేటు కూడా పడింది. విచారణ పూర్తయిన తర్వాత విధుల్లోకి చేరిన నాయక్ ఇప్పటికీ ఏ పోలీసు స్టేషన్‌లో నిలకడగా విధులు నిర్వహించలేదు. మొన్నటి వరకు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక శాఖ (ఏటీఎస్) బృందం జుహూ యూనిట్‌లో సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఏడాదిన్నర క్రితమే ఆయన్ను ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్ శాఖ నుంచి జుహూ యూనిట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ గోందియాకు బదిలీ చేయడం గమనార్హం.
ఏటీఎస్‌లో ఉత్తమ ప్రతిభ
ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా నాయక్ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనేక కీలక కేసులను ఛేదించారు. డ్రగ్స్ మాఫియా ఆటలు సాగనివ్వలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత, ఎంపీ సంజయ్ రావుత్, మాతోశ్రీ బంగ్లాకు బెదిరింపు ఫోన్లు చేసిన ఆగంతుకున్ని నాయక్ తన సహచర బృందంతో కలిసి కోల్‌కతాలో పథకం ప్రకారం అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు.
ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంలోనే ఆయనపై బదిలీ వేటు పడడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. గోందియా జిల్లాలో పోలీసుల కులధ్రువీకరణ పత్రాలను పరిశీలించే విభాగానికి బదిలీ చేశారు. అదేవిధంగా థానే జిల్లా బలవంతపు వసూళ్ల నిరోధక శాఖ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ కోథమిరేను గడ్చిరోలికి బదిలీ చేశారు.
చదవండి:
ఆన్‌లైన్‌లో బీర్ ఆర్డర్ చేసి లక్షన్నర పోగొట్టుకున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment