Encounter Specialist
-
మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు
ముంబై: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు పెట్టడం, మరో వ్యాపారవేత్త మన్సుఖ్ హిరానీ హత్య కేసులతో ఆయనకు సంబంధం ఉందని ఎన్ఐఏ చెబుతోంది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. లోనావాలా హిల్స్ ప్రాంతంలో అంబీవ్యాలీలో ఆయన్ను అదుపులోకి తీసుకొని, ఎన్ఐఏ ఆఫీసులో ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రదీప్ శర్మతో పాటు అరెస్టు చేసిన మరో ఇద్దరిని కూడా కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 28వ తేదీ వరకు న్యాయస్థానం వారిని ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది. బుధవారం సాయంత్రం నుంచి ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకోవడానికి ఎన్ఐఏ ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఆయన ఇంటితో సహా పలు చోట్ల సోదాలు జరిపింది. ఈ క్రమంలో ఎన్ఐఏకు పలు కీలక పత్రాలు కూడా దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థ సంతోష్ షెలార్, ఆనంద్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తుండగా ప్రదీప్ శర్మ వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు. చదవండి: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం చదవండి: మరో 9 నగరాల్లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్.. జాబితాలో విశాఖ, మిర్యాలగూడ -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేపట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అంధేరీలోని ప్రదీప్ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్‌పై పశ్నల వర్షం కురిపించింది ఎన్ఐఏ. ఇక ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్‌లోనే ఓసారి ప్రశ్నించారు కూడా. వాజే గురువు ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్. చదవండి: రియల్ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లు -
Daya Nayak: ఎన్కౌంటర్ స్పెషలిస్టుపై బదిలీ వేటు
సాక్షి, ముంబై: ఎన్కౌంటర్ స్పెష్టలిస్టుగా పేరొందిన ముంబై పోలీసు శాఖకు చెందిన దయా నాయక్‌ను విదర్భలోని గోందియా జిల్లాకు బదిలీ చేశారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేసినట్లు అప్పర్ పోలీసు డీజీపీ కుల్వంత్ సారంగల్ తెలిపారు. ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తుల గుండెళ్లో దడ పుట్టించిన నాయక్‌పై తరుచూ బదిలీ వేటు పడేది. ఒక్కచోట కూడా ఏడాది లేదా ఏడాదిన్నర కంటే ఎక్కువ కాలం విధులు నిర్వహించలేదు. ఓ సారి ఫేక్ ఎన్కౌంటర్ కేసులో సస్పెండ్ వేటు కూడా పడింది. విచారణ పూర్తయిన తర్వాత విధుల్లోకి చేరిన నాయక్ ఇప్పటికీ ఏ పోలీసు స్టేషన్లో నిలకడగా విధులు నిర్వహించలేదు. మొన్నటి వరకు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక శాఖ (ఏటీఎస్) బృందం జుహూ యూనిట్లో సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. ఏడాదిన్నర క్రితమే ఆయన్ను ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్ శాఖ నుంచి జుహూ యూనిట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ గోందియాకు బదిలీ చేయడం గమనార్హం. ఏటీఎస్‌లో ఉత్తమ ప్రతిభ ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా నాయక్ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనేక కీలక కేసులను ఛేదించారు. డ్రగ్స్ మాఫియా ఆటలు సాగనివ్వలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత, ఎంపీ సంజయ్ రావుత్, మాతోశ్రీ బంగ్లాకు బెదిరింపు ఫోన్లు చేసిన ఆగంతుకున్ని నాయక్ తన సహచర బృందంతో కలిసి కోల్‌కతాలో పథకం ప్రకారం అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంలోనే ఆయనపై బదిలీ వేటు పడడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. గోందియా జిల్లాలో పోలీసుల కులధ్రువీకరణ పత్రాలను పరిశీలించే విభాగానికి బదిలీ చేశారు. అదేవిధంగా థానే జిల్లా బలవంతపు వసూళ్ల నిరోధక శాఖ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ కోథమిరేను గడ్చిరోలికి బదిలీ చేశారు. చదవండి: ఆన్లైన్లో బీర్ ఆర్డర్ చేసి లక్షన్నర పోగొట్టుకున్నాడు! సన్యాసం తీసుకున్న ముఖేశ్ అంబానీ స్నేహితుడు -
Sub-Inspector Priyanka Sharma: గన్ లేడీ
ఎన్కౌంటర్ టీమ్‌లో గ్యాంగ్‌స్టర్‌తో తలపడిన తొలి మహిళా పోలీస్‌గా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక శర్మను యావత్భారత పోలీసు శాఖ అభినందిస్తోంది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ‘ట్రాకింగ్’ టీమ్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద క్రిమినల్స్‌ని వలపన్ని, చుట్టుముట్టి, వారి చేతుల్ని తల వెనుక పెట్టించి, అదుపులోకి తీసుకునే ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఆ టీమ్‌లోని వాళ్లంతా! ఎస్సై ప్రియాంకా శర్మ పదమూడేళ్లుగా వాళ్లలో ఒకరిగా పని చేస్తున్నారు. మొన్న గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె పాల్గొన్నారు. ఒక బులెట్ వచ్చి ఆమె జాకెట్‌కు తగిలింది. గ్యాంగ్‌స్టర్, అతడి అనుచరుడు పట్టుబడ్డారు. ‘‘ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్లో పాల్పంచుకున్న మొట్టమొదటి మహిళా పోలీస్ ప్రియాంక’’ అని ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ అభినందించారు. ఆయనతో పాటు డిపార్ట్మెంట్ కూడా ప్రియాంకకు పూలగుచ్ఛాలు అందిస్తోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంతో కాలంగా వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ ఒకరు సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున డిపార్ట్మెంట్కి సమాచారం అందింది. హుటాహుటిన టీమ్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో టీమ్‌తో ప్రియాంక కూడా ఉన్నారు. పట్టుకోబోతున్నది గ్యాంగ్‌స్టర్‌ని కనుక ప్రియాంక కూడా బులెట్ ప్రూమ్ జాకెట్ ధరించి ముఖాముఖి గన్ ఫైట్‌కు రెడీ అయి ఉన్నారు. గ్యాగ్‌స్టర్‌ని ఒక మూలకు రప్పించడం, పెడరెక్కలు విరిచి పోలీస్ వ్యాన్ ఎక్కించడం అంత తేలికేమీ కాదు. ముందసలు అతడు లొంగిపోయే మానసిక స్థితిలో ఉండడు. చంపడమో, చావడమో రెండే ఆప్షన్స్ తీసుకుంటాడు. ప్రగతి మైదాన్‌లోకి పోలీస్‌లు వచ్చారని తెలియగానే గ్యాగ్‌స్టర్ అలెర్ట్ అయ్యాడు. అతడితో ఒక అనుచరుడు ఉన్నాడు. ఇద్దరి దగ్గరా గన్స్ ఉన్నాయి. పోలీసులు దగ్గరకు రాగానే గ్యాంగ్‌స్టర్ కాల్పులు మొదలుపెట్టాడు. ప్రియాంక తన గన్‌తో అతడికి ఎదురుగా వెళ్లారు. ఆమెకు అతడిని కాల్చే ఉద్దేశం లేదు. లొంగిపొమ్మని హెచ్చరించడానికే తన గన్ తీశారు. వెంటనే గ్యాంగ్‌స్టర్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ ఆమె జాకెట్కి తగిలింది. అదే సమయంలో తక్కిన పోలీసులు అతడి కాళ్లపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడి అనుచరుడిపైన కూడా. ఇద్దర్నీ పట్టుకున్నారు. ప్రియాంకకు బులెట్ తగిలిన చోట పెద్ద గాయం ఏమీ అవలేదు. గ్యాంగ్‌స్టర్ పేరు రోహిత్ చౌదరి. అతడి అనుచరుడు ప్రవీణ్. రోహిత్‌పై రెండు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, సాకేత్ కోర్టు బయట ఒకరిని హత్య చేయబోయిన కేసు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక హత్య ఘటనలో అతడి హస్తం ఉందన్న కేసు. రెండేళ్లుగా అతడు అరెస్ట్ కాకుండా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. తల మీద నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎం.సి.ఓ.సి.ఎ. (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కూడా రోహిత్, ప్రవీణ్‌లపై అనేక మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 4.45 నిముషాలకు వాళ్లిద్దరూ కారులో భైరాన్ మార్గ్ గుండా వస్తూ పోలీసు పెట్రోలింగ్ ఆగమన్నా ఆగకుండా పోలీసులపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. పోలీసులూ వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ టీమ్ గ్యాంగ్‌స్టర్‌తో ఎన్‌కౌంటర్‌కు బయల్దేరింది. మొత్తానికి పోలీస్ కథ సుఖాంతం. ఈ కథలో నాయిక మాత్రం ప్రియాంకేనని ఢిల్లీ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటోంది. ‘‘నేనేమీ భయపడలేదు. నా డ్యూటీలో అదొక భాగంగా మాత్రమే అనిపించింది’’ అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు ప్రియాంక. ఆ నవ్వులు సహజంగానే రోహిత్‌కు, ప్రవీణ్‌కు నచ్చకపోవచ్చు. ∙ -
వీరప్పన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన డిపార్ట్మెంట్
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో భార్య పోటీ చేస్తుండడం ఓ పోలీసు అధికారిని ఇరకాటంలో పడేసింది. ఆయన్ను బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ పోలీసు బాసుల నిర్ణయం తీసుకున్నారు. తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా రాణిరంజితం పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్ దాఖలు, ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో అదే జిల్లాలో నగర అదనపు కమిషనర్‌గా ఆమె భర్త వెల్లదురై పనిచేస్తుండడంతో రచ్చకెక్కింది. చందనపు దొంగ వీరప్పన్ ఎన్కౌంటర్ టీంలో కీలక పాత్ర పోషించడమే కాదు, అనేక ఎన్కౌంటర్లతో ఎన్కౌంటర్ వెల్లదురైగా పేరు గడించిన ఈ అధికారికి భార్య రూపంలో విధి నిర్వహణలో చిక్కులు తప్పలేదు. దీంతో తిరునల్వేలి కమిషనర్ అన్బు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అధికార అన్నాడీఎంకే నుంచి చీలిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంలో ఈ అధికారి సతీమణి పోటీ చేస్తుండడం కాబోలు, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చెన్నై డీజీపీ కార్యాలయంలో ఎన్నికల విధులకు దూరంగా ఓ మూలన కూర్చోబెట్టడం గమనార్హం. శ్రీరంగంలో చిన్నమ్మ పూజలు సాక్షి, చెన్నై: తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం చిన్నమ్మ శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని కూడా సందర్శించారు. పరప్పన అగ్రహార చెర నుంచి చెన్నైకు వచ్చిన 41 రోజుల తర్వాత ఇంటి నుంచి శశికళ అడుగు బయటపెట్టారు. గురువారం తంజావూరులోని కులదైవం ఆలయంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం తిరుచ్చి శ్రీరంగం చేరుకుని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజల అనంతరం మధ్యాహ్నం తిరుచ్చిలోని బంధువు కళియ పెరుమాల్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం సమయపురం మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శనివారం చిన్నమ్మ భర్త నటరాజన్ మూడో వర్ధంతి. ఈసందర్భంన్ని పురస్కరించుకుని తంజావూరు ముల్లైవాయికాల్ స్తూపం ఎదురుగా ఉన్న నటరాజన్ సమాధి వద్ద చిన్నమ్మ నివాళులర్పించే అవకాశాలు ఉన్నాయి. చిన్నమ్మ తిరుచ్చి ఆలయ సందర్శన సమయంలో ఆమె వెన్నంటి అన్న కుమారుడు వెంకటేషన్ మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు వీవీఐపీగా ఆలయ సందర్శనకు వచ్చిన శశికళ ఇప్పుడు సాదాసీదా వ్యక్తిగా వెళ్లి దర్శించుకుని వచ్చారు. -
రాజకీయాల్లోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్!
ముంబై : ముంబైకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇన్స్పెక్టర్ ప్రదీప్‌శర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చేరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నటు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీనియర్ అధికారులకు పంపించారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున ఆయన పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా 2008లో ముంబై గ్యాంగ్‌స్టర్ లఖన్ భాయ్‌పై జరిగిన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శర్మతో పాటు మరో 13 మంది పోలీస్ అధికారులపై అప్పట్లో మహారాష్ట్ర పోలీస్ విభాగం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు విధులకు దూరంగా ఉన్న ప్రదీప్ శర్మ 2013లో తిరిగి థానే కైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు.. 1983లో మహారాష్ట్ర పోలీస్ విభాగంలో చేరిన ప్రదీప్ శర్మ అనతికాలంలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. 90వ దశకంలో అండర్‌వరల్డ్ మాఫియా కార్యకలపాలను అడ్డుకునే అధికారాన్ని ముంబై క్రైమ్ బాంచ్ శర్మకు కట్టబెట్టడంతో ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్‌ను అరెస్టు చేసి పెను సంచలనమే సృష్టించారు. మొత్తం 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్‌ను అంతమొందించిన ప్రదీప్ శర్మ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమాలు కూడా తెరకెక్కడం విశేషం. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీ
ముంబైలోని మాఫియాను గడగడలాడించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారారు రజనీకాంత్. ప్రజలను భయపెడుతున్న గ్యాంగ్‌స్టర్స్‌కు తూటాతో సమాధానం చెబుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారట రజనీ. అలాగే ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఇటీవల ముంబైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా ముంబైలోని ఓ కాలేజీలో వేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ రూమ్ సెట్లో రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ 29న స్టార్ట్ చెన్నైలో మొదలవుతుందని తెలిసింది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ‘దర్బార్’లో ఓ విలన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
మళ్లీ విధుల్లోకి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్
ముంబై: ఆ పోలీస్ అధికారి వయసు 55 ఏళ్లు.. పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లలో 113 మంది గ్యాంగ్స్టర్లను ఏరివేశారు. ఇది ప్రదీప్ శర్మ ట్రాక్ రికార్డు. బాలీవుడ్ లో ఈయన కథ ప్రేరణతోనే అబ్ తక్ చప్పన్ అనే ఓ సినిమా కూడా వచ్చింది. అయితే తర్వాతే గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపాడన్న ఆరోపణల నడుమ కొన్నాళ్లపాటు ఖాకీ చొక్కాకు దూరమయ్యారు. చివరకు వాటి నుంచి బయటపడటంతో ఇప్పుడు విధుల్లో చేరేందుకు సిద్ధమైపోతున్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లా అగ్ర ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో ప్రదీశ్ శర్మ జన్మించాడు. తండ్రిలాగే తాను టీచర్ అవ్వాలని కలలు కన్న శర్మ చివరకు పోలీసాఫీసర్ అయ్యారు. 1983 మహారాష్ట్ర పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. మే 6, 1993లో ఏకే-56 ఆయుధాల స్పెషలిస్ట్ సుభాష్ మకద్వాలా ఎన్‌కౌంటర్‌తో ప్రదీప్ వేట మొదలైంది. అక్కడ నుంచి గ్యాంగ్స్టర్ల భరతం పట్టే పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో లష్కర్-ఈ-తోయిబా సానుభూతిపరులను కూడా ఆయన వదిలిపెట్టలేదు. క్రమక్రమంగా ప్రదీప్ శర్మ పేరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా మారిపోయింది. ఆపై ఆయన దృష్టంతా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం అనుచరుల మీద పడింది. ఎన్కౌంటర్ల ద్వారా వారిని ఏరి పారేస్తూ వచ్చారు. 2000 సంవత్సరంలో తన ఇన్ఫార్మర్ ఓపీ సింగ్‌ను ఛోటా రాజన్ హత్య చేయటంతో ప్రదీప్ ఆగ్రహంతో రగిలిపోయారు. అప్పటి నుంచి రాజన్‌కు నిద్రలేకుండా చేశారు. ఛోటా రాజన్ అనుచరుల్ని ఒక్కొక్కరినీ హతమార్చుకుంటూ వెళ్లడంతో రాజన్ ఒకానొక సమయంలో కాళ్ల బేరానికి వచ్చాడు. ఆరోపణలు.. అరెస్ట్... వేటు 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్ కావటం, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు ప్రదీప్ శర్మ సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో ఆయనపై వేటు పడింది. ముందు కంట్రోల్ రూం నుంచి ధారావి స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం 2008లో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా 2010లో ఈ ఫేక్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి 21 మంది పోలీసాఫీసర్లను అరెస్ట్ చేయగా, వారిలో ప్రదీప్ శర్మ కూడా ఉన్నారు. అయితే 13 మంది అధికారులను జూలై 2013 లో ముంబై స్పెషల్ కోర్టు దోషులుగా ప్రకటించగా, శర్మ మాత్రం నిర్దోషిగా రిలీజ్ అయ్యారు. కానీ, కేసులో ఆయన పాత్రపై ఇంకా హైకోర్టులో కేసు నడుస్తుండటతో పునర్నియామకంపై పోలీస్ శాఖ వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో వచ్చే వారం ఆయన థానే పోలీస్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రదీప్ శర్మ పదవీకాలం 2018తో ముగియనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌ను గతేడాది ఇదే రీతిలో తిరిగి విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ పేరు వినగానే గుర్తొచ్చే చిత్రం తారైతప్పట్టై.ఆ చిత్రం పెద్దగా ప్రేక్షదారణ పొందక పోయినా అందులో కథానాయకిగా నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అభినయానికి మాత్రం ప్రశంసల జల్లు కురిసిందనే చెప్పాలి. అందులో ఆమె గరగాట కళాకారిణిగా నటించారు. తాజాగా యాక్షన్ అవతారమెత్తడం విశేషం. ఎస్ వరలక్ష్మి శరత్‌కుమార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి నిపుణన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సాధారణంగా పోలీస్ అధికారి పాత్రలను అర్జున్ పోషిస్తుంటారు. అయితే ఈ నిపుణన్ చిత్రంలో దర్శకుడు ఆయన్ని మరో వైవిధ్యభరిత పాత్రలో నటింపజేస్తూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఖాకీ దుస్తులు ధరింపజేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా యాక్షన్ అవతారం ఎత్తించారట. నిపుణన్ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఎక్కువగా పోలీస్ దుస్తుల్లోనే కనిపిస్తారట. ఇందులో ఆమె వీరోచిత ఫైట్స్ కూడా చేస్తున్నారట. తారైతప్పట్టై చిత్రం తరువాత తనను మరో కోణంలో చూపించే నిపుణన్ చిత్రం అంతకంటే మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఉన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పటికే ఒక కన్నడ చిత్రంలో నటిం చిన ఈ బ్యూటీ తాజాగా మలయాళ ంలోకి పరిచయం అవుతున్నారు. అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టితో నటిస్తున్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సస్పెండయ్యారు!
''దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర'' లాంటి డైలాగులు పండిన ఎన్నో తెలుగు సినిమాలకు స్ఫూర్తి, ముంబై అండర్ వరల్డ్‌ను గజగజ వణికించిన ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఎస్ఐ దయానాయక్ను మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 2012లో మళ్లీ సర్వీసులోకి వచ్చిన దయానాయక్పై విచారణ పెండింగులో ఉంది. ఈలోపు ఆయనను నాగ్‌పూర్ బదిలీ చేయగా, ఆయన అక్కడ చేరలేదు. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు. 1995 బ్యాచ్ అధికారి అయిన దయానాయక్ దాదాపు ఆరున్నరేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఆయనపై మాజీ పాత్రికేయుడు కేతన్ తిరోద్కర్ ఏసీబీకి ఫిర్యాదుచేశారు. దాంతో ఏసీబీ 2006 సంవత్సరంలో ఆయనను అరెస్టు చేసింది. అయితే, 2009లో నాయక్ మీద ఆరోపణలకు ఆధారాలు లేవంటూ నాటి డీజీపీ ఎస్ఎస్ విర్క్ అన్ని కేసుల నుంచి విముక్త కల్పించారు. అలాగే దయాపై పెట్టిన మోకా కేసును కూడా 2010లో సుప్రీంకోర్టు కొట్టేసింది. 2012లో దయాను మళ్లీ పోలీసు దళంలోకి తీసుకున్నా, ఆయుధాల విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఆయనను బాంద్రా నుంచి అంధేరి వరకు ఉండే వెస్ట్ రీజియన్‌కు బదిలీ చేశారు. నాయక్ తన పదవీకాలంలో వినోద్ మట్కర్, రఫిక్ డబ్బా, సాదిక్ కాలియా లాంటి దాదాపు 80 మందికి పైగా గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేశారు. ఆయన తుపాకి గుళ్లకు బలైనవాళ్లలో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు కూడా ఉన్నారు. -
బీజేపీలో చేరిన రవీంద్ర ఆంగ్రే
సాక్షి, ముంబై: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపున్న మాజీ పోలీసు అధికారి రవీంద్ర ఆంగ్రే బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రావ్‌సాహెబ్ దాణ్వే సమక్షంలో సోమవారం ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రవీంద్ర ఆంగ్రే తన హాయంలో మొత్తం 54 ఎన్కౌంటర్లు చేశారు. అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఠాణేలోని మహేష్ వాగ్ అనే బిల్డర్‌ను బెదిరించి, అతని ఆస్తులను ఆక్రమించేందుకు ప్రయత్నించాడని, అతని హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. మహేష్ వాగ్ ఫిర్యాదుపై 2008లో రవీంద్ర ఆంగ్రేను పోలీసులు అరెస్టు చేసి ఆయనపై సస్పెన్షన్ విధించారు. సుమారు 14 నెలలపాటు జైలులో గడిపిన అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఆంగ్రే తనపై కాల్పులు జరిపాడంటూ మహేష్ వాగ్ మరోసారి ఆరోపించడంతో మళ్లీ 2010లో అరెస్టు చేశారు. అయితే ఎట్టకేలకు ఈ ఆరోపణల నుంచి ఆయనకు విముక్తి లభించింది. పోలీసు ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేసి తిరిగి విధుల్లో చేర్చుకుంది. కానీ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరినందున రాజకీయాలలో తన రెండో ఇన్నింగ్‌ను ప్రారంభించారని చెప్పవచ్చు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా?
రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ‘దూకుడు’ చేసిన హల్చల్ అంతా ఇంతాకాదు. ఆ సినిమా దెబ్బకు పాత రికార్డులన్నీ చెల్లా చెదురైపోయూయయి. మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని తీసుకొచ్చిందా చిత్రం. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అనగానే... ‘ఆగడు’పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. తమన్నా తొలిసారి మహేష్‌తో జతకడుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని ఇటీవల లాంచనంగా జరిపారు. అయితే... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. దానికి కారణం మహేష్ ‘1’ సినిమా. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండటంతో ‘ఆగడు’ షూటింగ్ కాస్త ఆగాల్సి వచ్చింది. ‘1’ షూటింగ్ త్వరలో పూర్తి కానుండటంతో ఈ నెల 28న ‘ఆగడు’ పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ముందు శ్రీహరిని అనుకున్నారు. ఆయన హఠాన్మరణం కారణంగా ఇప్పుడు ఆ పాత్రకు సాయికుమార్ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా కనిపిస్తారని ఫిలిమ్‌నగర్ సమాచారం. ‘దూకుడు’లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. ‘ఆగడు’లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్.