ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రియాంక శర్మ
ఎన్‌కౌంటర్ టీమ్‌లో గ్యాంగ్‌స్టర్‌తో తలపడిన తొలి మహిళా పోలీస్‌గా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రియాంక శర్మను యావత్భారత పోలీసు శాఖ అభినందిస్తోంది.
ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ‘ట్రాకింగ్’ టీమ్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద క్రిమినల్స్‌ని వలపన్ని, చుట్టుముట్టి, వారి చేతుల్ని తల వెనుక పెట్టించి, అదుపులోకి తీసుకునే ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు ఆ టీమ్‌లోని వాళ్లంతా! ఎస్సై ప్రియాంకా శర్మ పదమూడేళ్లుగా వాళ్లలో ఒకరిగా పని చేస్తున్నారు. మొన్న గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె పాల్గొన్నారు. ఒక బులెట్ వచ్చి ఆమె జాకెట్‌కు తగిలింది. గ్యాంగ్‌స్టర్, అతడి అనుచరుడు పట్టుబడ్డారు. ‘‘ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎన్‌కౌంటర్‌లో పాల్పంచుకున్న మొట్టమొదటి మహిళా పోలీస్ ప్రియాంక’’ అని ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ అభినందించారు. ఆయనతో పాటు డిపార్ట్‌మెంట్ కూడా ప్రియాంకకు పూలగుచ్ఛాలు అందిస్తోంది.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంతో కాలంగా వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ ఒకరు సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున డిపార్ట్‌మెంట్‌కి సమాచారం అందింది. హుటాహుటిన టీమ్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో టీమ్‌తో ప్రియాంక కూడా ఉన్నారు. పట్టుకోబోతున్నది గ్యాంగ్‌స్టర్‌ని కనుక ప్రియాంక కూడా బులెట్ ప్రూమ్ జాకెట్ ధరించి ముఖాముఖి గన్ ఫైట్‌కు రెడీ అయి ఉన్నారు. గ్యాగ్‌స్టర్‌ని ఒక మూలకు రప్పించడం, పెడరెక్కలు విరిచి పోలీస్ వ్యాన్ ఎక్కించడం అంత తేలికేమీ కాదు. ముందసలు అతడు లొంగిపోయే మానసిక స్థితిలో ఉండడు. చంపడమో, చావడమో రెండే ఆప్షన్స్ తీసుకుంటాడు.
ప్రగతి మైదాన్‌లోకి పోలీస్‌లు వచ్చారని తెలియగానే గ్యాగ్‌స్టర్ అలెర్ట్ అయ్యాడు. అతడితో ఒక అనుచరుడు ఉన్నాడు. ఇద్దరి దగ్గరా గన్స్ ఉన్నాయి. పోలీసులు దగ్గరకు రాగానే గ్యాంగ్‌స్టర్ కాల్పులు మొదలుపెట్టాడు. ప్రియాంక తన గన్‌తో అతడికి ఎదురుగా వెళ్లారు. ఆమెకు అతడిని కాల్చే ఉద్దేశం లేదు. లొంగిపొమ్మని హెచ్చరించడానికే తన గన్ తీశారు. వెంటనే గ్యాంగ్‌స్టర్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ ఆమె జాకెట్‌కి తగిలింది. అదే సమయంలో తక్కిన పోలీసులు అతడి కాళ్లపై ఆరు రౌండ్‌ల కాల్పులు జరిపారు. అతడి అనుచరుడిపైన కూడా. ఇద్దర్నీ పట్టుకున్నారు. ప్రియాంకకు బులెట్ తగిలిన చోట పెద్ద గాయం ఏమీ అవలేదు.
గ్యాంగ్‌స్టర్ పేరు రోహిత్ చౌదరి. అతడి అనుచరుడు ప్రవీణ్. రోహిత్‌పై రెండు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, సాకేత్ కోర్టు బయట ఒకరిని హత్య చేయబోయిన కేసు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక హత్య ఘటనలో అతడి హస్తం ఉందన్న కేసు. రెండేళ్లుగా అతడు అరెస్ట్ కాకుండా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. తల మీద నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎం.సి.ఓ.సి.ఎ. (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కూడా రోహిత్, ప్రవీణ్‌లపై అనేక మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 4.45 నిముషాలకు వాళ్లిద్దరూ కారులో భైరాన్ మార్గ్ గుండా వస్తూ పోలీసు పెట్రోలింగ్ ఆగమన్నా ఆగకుండా పోలీసులపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. పోలీసులూ వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ టీమ్ గ్యాంగ్‌స్టర్‌తో ఎన్‌కౌంటర్‌కు బయల్దేరింది. మొత్తానికి పోలీస్ కథ సుఖాంతం. ఈ కథలో నాయిక మాత్రం ప్రియాంకేనని ఢిల్లీ క్రైమ్ డిపార్ట్‌మెంట్ అంటోంది. ‘‘నేనేమీ భయపడలేదు. నా డ్యూటీలో అదొక భాగంగా మాత్రమే అనిపించింది’’ అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు ప్రియాంక. ఆ నవ్వులు సహజంగానే రోహిత్‌కు, ప్రవీణ్‌కు నచ్చకపోవచ్చు. ∙
Comments
Please login to add a commentAdd a comment