daya nayak
-
Daya Nayak: ఎన్కౌంటర్ స్పెషలిస్టుపై బదిలీ వేటు
సాక్షి, ముంబై: ఎన్కౌంటర్ స్పెష్టలిస్టుగా పేరొందిన ముంబై పోలీసు శాఖకు చెందిన దయా నాయక్‌ను విదర్భలోని గోందియా జిల్లాకు బదిలీ చేశారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేసినట్లు అప్పర్ పోలీసు డీజీపీ కుల్వంత్ సారంగల్ తెలిపారు. ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తుల గుండెళ్లో దడ పుట్టించిన నాయక్‌పై తరుచూ బదిలీ వేటు పడేది. ఒక్కచోట కూడా ఏడాది లేదా ఏడాదిన్నర కంటే ఎక్కువ కాలం విధులు నిర్వహించలేదు. ఓ సారి ఫేక్ ఎన్కౌంటర్ కేసులో సస్పెండ్ వేటు కూడా పడింది. విచారణ పూర్తయిన తర్వాత విధుల్లోకి చేరిన నాయక్ ఇప్పటికీ ఏ పోలీసు స్టేషన్లో నిలకడగా విధులు నిర్వహించలేదు. మొన్నటి వరకు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక శాఖ (ఏటీఎస్) బృందం జుహూ యూనిట్లో సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. ఏడాదిన్నర క్రితమే ఆయన్ను ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్ శాఖ నుంచి జుహూ యూనిట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ గోందియాకు బదిలీ చేయడం గమనార్హం. ఏటీఎస్‌లో ఉత్తమ ప్రతిభ ఖార్ పోలీసు స్టేషన్ ఏటీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా నాయక్ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనేక కీలక కేసులను ఛేదించారు. డ్రగ్స్ మాఫియా ఆటలు సాగనివ్వలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత, ఎంపీ సంజయ్ రావుత్, మాతోశ్రీ బంగ్లాకు బెదిరింపు ఫోన్లు చేసిన ఆగంతుకున్ని నాయక్ తన సహచర బృందంతో కలిసి కోల్‌కతాలో పథకం ప్రకారం అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు. ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంలోనే ఆయనపై బదిలీ వేటు పడడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. గోందియా జిల్లాలో పోలీసుల కులధ్రువీకరణ పత్రాలను పరిశీలించే విభాగానికి బదిలీ చేశారు. అదేవిధంగా థానే జిల్లా బలవంతపు వసూళ్ల నిరోధక శాఖ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ కోథమిరేను గడ్చిరోలికి బదిలీ చేశారు. చదవండి: ఆన్లైన్లో బీర్ ఆర్డర్ చేసి లక్షన్నర పోగొట్టుకున్నాడు! సన్యాసం తీసుకున్న ముఖేశ్ అంబానీ స్నేహితుడు -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సస్పెండయ్యారు!
''దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర'' లాంటి డైలాగులు పండిన ఎన్నో తెలుగు సినిమాలకు స్ఫూర్తి, ముంబై అండర్ వరల్డ్‌ను గజగజ వణికించిన ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఎస్ఐ దయానాయక్ను మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 2012లో మళ్లీ సర్వీసులోకి వచ్చిన దయానాయక్పై విచారణ పెండింగులో ఉంది. ఈలోపు ఆయనను నాగ్‌పూర్ బదిలీ చేయగా, ఆయన అక్కడ చేరలేదు. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు. 1995 బ్యాచ్ అధికారి అయిన దయానాయక్ దాదాపు ఆరున్నరేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఆయనపై మాజీ పాత్రికేయుడు కేతన్ తిరోద్కర్ ఏసీబీకి ఫిర్యాదుచేశారు. దాంతో ఏసీబీ 2006 సంవత్సరంలో ఆయనను అరెస్టు చేసింది. అయితే, 2009లో నాయక్ మీద ఆరోపణలకు ఆధారాలు లేవంటూ నాటి డీజీపీ ఎస్ఎస్ విర్క్ అన్ని కేసుల నుంచి విముక్త కల్పించారు. అలాగే దయాపై పెట్టిన మోకా కేసును కూడా 2010లో సుప్రీంకోర్టు కొట్టేసింది. 2012లో దయాను మళ్లీ పోలీసు దళంలోకి తీసుకున్నా, ఆయుధాల విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఆయనను బాంద్రా నుంచి అంధేరి వరకు ఉండే వెస్ట్ రీజియన్‌కు బదిలీ చేశారు. నాయక్ తన పదవీకాలంలో వినోద్ మట్కర్, రఫిక్ డబ్బా, సాదిక్ కాలియా లాంటి దాదాపు 80 మందికి పైగా గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేశారు. ఆయన తుపాకి గుళ్లకు బలైనవాళ్లలో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు కూడా ఉన్నారు.