సాక్షి, ముంబై: ఎంపీ నవనీత్‌కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు హనుమాన్ చాలీసా వివాదంతో మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి ముంబైలోని ఖర్ పోలీస్టేషన్‌కు సైతం తరలించారు. అయితే పోలీసుల తీరుపై ఆమె సంచలన ఆరోపణలకు దిగారు.
స్టేషన్‌లో పోలీసులు తనను వేధించారని, కులం పేరుతో అవమానించారంటూ ఎంపీ నవనీత్‌కౌర్, సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. రాత్రిపూట దాహం వేసి నీళ్లు అడిగినా ఇవ్వలేదని, పైగా తాను ఎస్సీ అయినందున వాళ్లు తాగే గ్లాసుల్లో నీళ్లు అస‍్సలు ఇవ్వలేమంటూ వేధించారంటూ ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్ స్టేషన్‌లో జంతువుల కన్నా హీనంగా తమను చూశారంటూ పేర్కొన్నారామె. కాబట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
దీంతో లోక్‌సభ సెక్రెటేరియట్ ప్రివిలైజ్ అండ్ ఎథిక్స్ బ్రాంచ్.. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ నివేదిక కోరింది. అయితే ఈ ఎపిసోడ్‌లో ఊహించని పరిణామం జరిగింది. ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ పాండే ట్విటర్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. నవనీత్‌కౌర్, ఆమె భర్త రవి, కూడా ఉన్న యువతి రిలాక్స్‌గా టీ తాగుతున్న వీడియో పోస్ట్ చేసిన సీపీ సంజయ్ పాండే.. ఇంత కన్నా ఏమైనా చెప్పాలా? అంటూ క్యాప్షన్ ఉంచారు.
Do we say anything more pic.twitter.com/GuUxldBKD5
— Sanjay Pandey (@sanjayp_1) April 26, 2022
ఇదిలా ఉండగా.. సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ నవనీత్‌కౌర్, ఆమె భర్త రవి రానాలు ఛాలెంజ్ చేసి నగరంలో తీవ్ర ఉద్రిక్తతలను కారణం అయ్యారు. దీంతో విద్వేషాలను రగిల్చే ప్రయత్నం, పోలీస్ ఆదేశాలను ఉల్లంఘించడం, విధుల్లో ఆటంకం కలిగించడం తదితర నేరాల కింద వీళ్లిద్దరిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment