సాక్షి, ముంబై: ముంబై అగ్నిమాపక విభాగంలోకి త్వరలో ఆధునిక ఫైర్ బైక్స్ రానున్నాయి. ఈ బైక్స్ అందుబాటులోకి వస్తే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు విస్తరించకుండా నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ వాటిల్లదని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలనా విభాగం భావిస్తోంది. ఈ మేరకు వార్డుకు ఒకటి చొప్పున ముంబై పరిధిలో ఉన్న మొత్తం 24 వార్డుల కోసం 24 ఫైర్ బైక్స్ కొనుగోలు చేయనున్నట్లు బీఎంసీ డిప్యూటీ చీఫ్ ఫైర్ బ్రిగేడ్ అధికారి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఒక్కో బైక్ ధర రూ. 13 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ముంబై నగరం వేగంగా విస్తరిస్తోంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ టవర్లు, ఆకాశ హర్మ్యాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.
అయితే, పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్లు రోడ్ల విస్తరణ జరగలేదు. ఫలితంగా నిత్యం నగర రహదారులపై ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీంతో నగరంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్లు సకాలంలో చేరుకోలేకపోతున్నాయి. ఫైరింజన్లే కాదు అంబులెన్స్‌ల పరిస్థితి కూడా దాదాపుగా ఇలానే ఉంటోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, టవర్ల వద్దకు వెళ్లేందుకు విశాలమైన దారి లేకపోవడంతో భారీ ఫైరింజన్లు సంఘటనా స్థలం దగ్గరి వరకు వెళ్లలేకపోతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మినీ ఫైరింజన్లతోనే మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే, అప్పటికే మంటలు ఉగ్రరూపం దాల్చి జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించిన బీఎంసీ, ఫైర్ బైక్స్ అయితే ఇలాంటి సందర్భాల్లో బాగా పనికొస్తాయని భావించింది.
చదవండి: (పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి)
ఈ ఫైర్ బైక్స్ ట్రాఫిక్ జామ్‌లో కూడా సునాయాసంగా ముందుకు దూసుకుపోవడంతో పాటు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. ఇవి మంటలను పూర్తిగా అదుపు చేయకపోయినప్పటికీ కనీసం విస్తరించకుండానైనా నిలువరిస్తాయి. ఆ లోపు పెద్ద ఫైరింజన్లు వచ్చేస్తాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువ జరగదని రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. కాగా, ఇలాంటి ఫైర్ బైక్‌లను కొనుగోలు చేయాలని బీఎంసీ రెండేళ్ల కిందటే భావించింది. ఆ మేరకు పరిపాలనా విభాగం మంజూరునిచ్చింది. టెండర్లను ఆహ్వనించే ప్రక్రియ కూడా ప్రారంభించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తితో ఆ కొనుగోలు ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి రావడంతో ఫైర్ బైక్స్ కొనుగోలు అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.
ఫైర్ బైక్స్ ప్రత్యేకతలు
►ఆధునిక సౌకర్యాలుండే ఈ ఫైర్ బైక్స్‌కు 20 లీటర్ల చొప్పున సామర్థ్యం ఉండే రెండు వాటర్ ట్యాంకులు ఉంటాయి.
►నేరుగా సమీప ఫైర్ స్టేషన్‌తో సంప్రదించేలా కమ్యూనికేషన్ సౌకర్యముంటుంది.
►శిక్షణ పొందిన అగ్నిమాపక శాఖ సిబ్బంది బైక్ రైడర్స్‌గా ఉంటారు.
►పోర్టబుల్ ఫైర్ సిస్టం, 30 మీటర్ల హోజరిల్ పైపు, ఫైర్ పంపు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉంటాయి.
చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా)
Comments
Please login to add a commentAdd a comment