ఘాట్కోపర్ హోర్డింగ్ దుర్ఘటనపై రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర శిసావే
రైల్వే పోలీసు క్వార్టర్స్ పరిధిలో సోమవారం నేలకూలిన భారీ హోర్డింగ్
బీఎంసీ నిబంధనలకు విరుద్ధంగా 120/120 అడుగులతో భారీగా ఏర్పాటు
రైల్వే మాజీ కమిషనర్ కేసర్ ఖాలీద్ హయాంలో హోర్డింగ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
హోర్డింగ్ యజమానిపై కేసు నమోదుతో పాటు, ఏర్పాటు అనుమతులపై దర్యాప్తు చేస్తున్నామన్న కమిషనర్
దాదర్: ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కూలిన 14 మంది మృతిచెందిన దుర్ఘటన ప్రజలను తీవ్రంగా కలవరపరిచింది. మృతులు, గాయపడ్డవారి బంధువుల ఆందోళన నేపథ్యంలో అసలు ఈ భారీ హోర్డింగ్‌కు ఎవరు? ఎలా అనుమతిచ్చారన్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఈదురు గాలులు, దుమ్ము, ధూళితో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలుల వల్ల పలు హోర్డింగులు, చెట్లు నేలకూలాయి.
ఇదే క్రమంలో ఘాట్కోపర్‌లోని ఓ పెట్రోల్ బంకు షెడ్డుపై 120/120 అడుగుల భారీ హోర్డింగ్ కూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆకస్మాత్తుగా కురిసిన భారీవర్షం, ఈదురు గాలుల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో అగి్నమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సంఘటన స్ధలానికి చేరుకొనేందుకు తీవ్ర ఆలస్యమైంది
దీంతో అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాల ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా సహాయ చర్యలు కొనసాగాయి. ఐతే వీరిలో తీవ్ర గాయాలపాలైన కొందరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని, దీంతో మృతుల సంఖ్య 14కు చేరిందని చడ్డానగర్ పోలీసులు తెలిపారు.
హోర్డింగ్‌పై బీఎంసీకి మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య లేఖ
నేల కూలిన భారీ హోర్డింగ్ పునాదులు, వెల్డింగ్ చేసిన ఇనుప పట్టీలు చిలుము పట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని తొలగించాలని స్ధానిక మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య బీఎంసీకి గతంలో లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన బీఎంసీ కమిషనర్ (అడ్మిన్) భూషన్ గగ్రానీ రెండు రోజుల కిందటే హోర్డింగ్ యజమానికి నోటీసు జారీ చేశారు. ఈలోగానే సోమవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఈ భారీ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకు షెడ్డుపై కూలింది. ఘటన జరిగిన సమయంలో బంకులో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కోసం పదుల సంఖ్యలో ఆటోలు, కార్లు, టెంపోలు, ఇతర వాహనాలు క్యూలో ఉన్నా యి.
వీరే కాకుండా ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో అనేక మంది ద్విచక్ర వాహన చోదకులు తల దాచుకునేందుకు బంకు షెడ్డు కిందకు చేరుకున్నారు. అలాగే భారత్ పెట్రోలియం బంకు సైన్ ప్రాంతం తర్వాత చడ్డానగర్‌లోనే ఉంది. ఆ తరువాత ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వేపై థానే వరకు భారత్ పెట్రోలియం బంకులు లేవు. దీంతో చడ్డానగర్‌లో హైవేకు ఆనుకుని ఉన్న ఈ పెట్రోల్ బంకు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది.
సోమవారం సాయంత్రం కూడా బంకులో ఇదే పరిస్థితి ఉండటం, అదే సమయంలో భారీ హోర్డింగ్, బంకు పైకప్పు కూలడంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, అగి్నమాపక అధికారులు తీవ్రంగా శ్రమించారు. కార్లపై హోర్డింగ్, పెట్రోల్ బంకు పైకప్పు కూలడంతో కార్ల డోర్లు జామ్ అయ్యాయి. వాహనాలకు సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టం ఉండడంవల్ల ఇంజన్ (ఆన్‌లో ఉంటేనే) పని చేస్తేనే డోర్లు తెరుచుకుంటాయి. దీంతో పలువురు కార్లలోనే ఇరుక్కుపోయారు. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా కారణమైందని, క్షతగాత్రులను 40 అంబులెన్స్‌ల ద్వారా వివిధ ఆస్పత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.
గాలి తీవ్రత వల్లే.. ప్రమాదం
ఘాట్కోపర్ పరిసరాల్లో నాలుగు భారీ హోర్డింగులున్నాయి. సోమవారం నేల కూలిన హోర్డింగ్ రైల్వే పోలీసు క్వార్టర్స్ పరిధిలో ఉంది. మహరాష్ట్ర స్టేట్ పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఉన్న ఈ స్థలంలో ప్రమాదానికి గురైన హోర్డింగ్‌కు రైల్వే మాజీ కమిషనర్ కేసర్ ఖాలీద్ హయాంలో అంటే 2021లో 10–20 ఏళ్ల కాలవ్యవధి కోసం అనుమతిచి్చనట్లు తెలుస్తోంది. బీఎంసీ నిబంధనల ప్రకారం ఒక్కో హోర్డింగు 40/40 అడుగుల ఆకారంలో ఉండాలి. కానీ ఈ హోర్డింగులు ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే 120/120 అడుగుల ఆకారంలో ఉండడంవల్ల గాలి వేగాన్ని తట్టుకోలేక కూలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
హోర్డింగ్ యజమాని, ఈగో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సంచాలకుడు భావేష్ భిడేపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడనే అభియోగం మోపుతూ స్ధానిక పంత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోర్డింగ్ అనుమతులకు సంబంధించి కేసర్ ఖాలీద్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని, అనంతరం కేసు దర్యాప్తును పూర్తిస్థాయిలో కొనసాగిస్తామని రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర శిసావే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment