మళ్లీ మళ్లీ వెలుస్తు‍న్న అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లు : అడ్డుకట్ట వేసేదెలా? | Mumbai Illegal Flexi and Political Hoardings Causing Concerns | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ వెలుస్తు‍న్న అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లు : అడ్డుకట్ట వేసేదెలా?

Published Sat, Dec 14 2024 5:01 PM | Last Updated on Sat, Dec 14 2024 5:14 PM

Mumbai Illegal Flexi and Political Hoardings Causing Concerns

ముంబై రోడ్లపై కుప్పలు  తెప్పలుగా బ్యానర్లు, ఫ్లెక్సీలు 

గల్లీలు మెయిన్‌ రోడ్లనే  తేడాలేకుండా పార్టీల జెండాలు, లీడర్ల కటౌట్లు, వెల్‌కం బోర్డులు 

ఎప్పటికప్పుడు తొలగిస్తున్న  బీఎంసీ సిబ్బంది తొలగించిన కొన్నాళ్లకే మళ్లీ ప్రత్యక్షం 

పరిష్కారం కోసం అన్వేషిస్తున్న అధికారులు   

దాదర్‌: ముంబై రహదారులపై ఎక్కడ చూసినా అక్రమ బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. తొలగించిన కొద్ది రోజులకే మళ్లీ వెలుస్తున్నాయి. దీంతో ఇలాంటి అక్రమ బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలు, పార్టీ జెండాలపై ఉక్కుపాదం మోపాలని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) నిర్ణయించింది. ఇందుకు బాధ్యులైనవారికి భారీ జరిమానా విధించడంతోపాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ప్రియనేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్రమంగా ఏర్పాటు చేసిన సుమారు రెండు వేల బ్యానర్లు, ఫ్లెక్సీలను బీఎంసీ సిబ్బంది తొలగించారు. వీటిలో వేయికిపైగా రాజకీయ పా‍ర్టీలకు సంబంధించినవి కాగా మిగిలినవి వివిధ ధార్మిక, మత, ప్రవచన కార్యక్రమాలు, విద్యా సంస్ధల ప్రకటనలకు సంబంధించినవి. ఈ అక్రమ బ్యానర్లు, ప్లెక్సీలు తొలగించిన కొద్దీ మళ్లీ వెలుస్తున్నాయి.

ప్రధాన రహదారులు, జంక్షన్లు మొదలుకుని గల్లీలను సైతం వదలకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ తొలగించినా మరుసటి రోజు మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..? ఎవరి పేరిట, ఏ పార్టీ పేరుతో ఏర్పాటు చేస్తున్నారో బ్యానర్‌ను చూసి తెలుసుకోవచ్చు. కానీ వాటిని ఎవరు ఏర్పాటు చేస్తున్నారో మాత్రం తెలియడం లేదు. గిట్టని వారు లేదా ప్రతిపక్ష పార్టీలు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసినవారు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే తప్ప చర్యలు తీసుకోలేని పరిస్ధితి. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక బీఎంసీ సిబ్బంది తలపట్టుకుంటున్నారు.  

అక్రమమా? సక్రమమా? 
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముంబైలో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధుల ప్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులు, పార్టీ జెండాలు విపరీతంగా వెలిశాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి రావడంతో వాటన్నింటిని తొలగించారు. పదుల సంఖ్యలో ట్రక్కుల్లో వాటిని డంపింగ్‌ గ్రౌండ్‌లకు తరలించారు. కాగా ఫలితాలు వెలువడిన తరువాత గెలిచిన పార్టీ అభ్యర్ధి లేదా ఇండిపెండెంట్‌ అభ్యర్ధుల అభిమానులు, కార్యకర్తలు, శుభాకాంక్షలు తెలియజేసే ప్లెక్సీలు, బ్యానర్లను మళ్లీ ఏర్పాటు చేశారు. వీటిలో 30 శాతం అనుమతి తీసుకుని ఏర్పాటు చేయగా 70 శాతం అక్రమంగా ఏర్పాటు చేసినవి. దీంతో ముంబై రోడ్లన్నీ వికారంగా తయారయ్యాయి. వీటిలో అనుమతి తీసుకుని ఏర్పాటుచేసినవేవో, అక్రమమైనవేవో గుర్తించడం బీఎంసీ సిబ్బందికి కష్టతరమవుతోంది.  

వందలాది ట్రక్కులు, టిప్పర్ల వినియోగం... 
ఇదిలాఉండగా ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ శిందే, అజీత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శుభాకాంక్షలు తెలియజేసే బ్యానర్లు, ఫ్లెక్సీలను మళ్లీ విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారానికి ముందే కాబోయే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ అంటూ కొందరు, అజిత్‌ పవార్‌ అంటూ మరికొందరు బ్యానర్లు ఏర్పాటుచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. కానీ ఢిల్లీ అధిష్టానం అధికారికంగా ఫడ్నవీస్, శిందే, అజిత్‌ పవార్‌ల పేర్లు ఖరారు చేయడంతో మూడు పారీ్టల కార్యకర్తలు, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలియజేసే బ్యానర్లు, ఫ్లెక్సీలు, రోడ్ల మధ్యలో విద్యుత్‌ పోల్స్, రెయిలింగ్స్‌కు పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. దీంతో వీటిని తొలగించి డంపింగ్‌ గ్రౌండ్లకు తరలించాలంటే బీఎంసీ సిబ్బందికి వందల సంఖ్యలో ట్రక్కులు, టిప్పర్‌లను వినియోగించాల్సిన పరిస్ధితి వచ్చింది. అక్రమంగా ఏర్పాటుచేసే బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలవల్ల బీఎంసీ ఆదాయానికి కూడా గండిపడుతోంది.     

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement