న్యూఢిల్లీ: అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’అనే నినాదంతో దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన క్రీడాకారులు విజయులై తిరిగిరావాలని ఆకాంక్షించారు. భారత ఆటగాళ్లకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..
► భారతదేశానికి పరాయి పాలన నుంచి స్వాతంత్య్ర లభించి ఈ ఆగస్టు 15వ తేదీ నాటికి 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరం రాబోతోంది. ఏడాది తర్వాత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా దేశమంతటా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నాం.
► జాతి అభివృద్ధి దిశగా కలిసి పనిచేయడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం.
► జాతిపిత మహాత్మాగాంధీ భారత్ చోడో ఆందోళన్ (క్విట్ ఇండియా ఉద్యమం) చేపట్టారు. అదే స్ఫూర్తితో ప్రతి భారతీయుడు భారత్ జోడో ఆందోళన్ (ఐక్య భారత ఉద్యమం)లో పాలు పంచుకోవాలి. వైవిధ్యం, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఐక్యంగా ఉండడం అందరి బాధ్యత.
► అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత జాతీయ గీతం జనగణమనను సాధ్యమైనంత ఎక్కువ మంది కలిసి ఆలపించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం http://rarhtrafan.in అనే వెబ్‌సైట్‌ను సృష్టించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా జాతీయ గీతాన్ని ఆలపించి, రికార్డు చేసుకోవచ్చు. జాతీయ గీతం ఆలాపనతో మీరంతా అనుసంధానమై ఉంటారని ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మన ముందుకు రాబోతున్నాయి.
► ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లను ప్రోత్సహించండి. ఇందుకోసం ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రారంభమైన ‘విక్టరీ పంచ్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనండి. భారత ఆటగాళ్లకు మద్దతు కొనసాగించండి. మీ విక్టరీ పంచ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు.
► ఈ నెల 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. 1999లో మన దేశం గర్వించేలా అపూర్వ పోరాటం సాగించిన అమర జవాన్లకు నివాళులర్పించాల్సిన సందర్భమిది.
► ఇక మన్ కీ బాత్ అనేది ప్రతినెలా సానుకూలత, సామూహికతకు సంబంధించిన వేడుకలాంటిది. దీనిపై ప్రజల నుంచి వస్తున్న అన్ని సలహాలు సూచనలను నేను పాటించలేకపోవచ్చు కానీ వాటిలో చాలావరకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తున్నా.
► మన్ కీ బాత్‌కి సందేశాలు, సలహాలు అందజేస్తున్న వారిలో దాదాపు 75 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని ఒక అధ్యయనంలో తేలింది. ఇదొక మంచి పరిణామం. ఈ కార్యక్రమంలో సానుకూలత, సున్నితత్వం ఇమిడి ఉన్నాయి. ఇందులో సానుకూల అంశాలే మాట్లాడుకుంటాం.
► దేశంలో వలస పాలన కొనసాగుతున్నప్పుడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఒక్కతాటిపైకి వచ్చారు. ఉమ్మడి లక్ష్య సాధన కోసం చేతులు కలిపారు. ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం ప్రజలంతా చేతులు కలపాలి.
► స్థానిక వ్యాపారులకు, కళాకారులకు, వృత్తి నిపుణులకు, చేనేత కార్మికులకు అండగా నిలవడం ద్వారా జాతి నిర్మాణంలో భాగస్వాములు కావొచ్చు,
► ఆగస్టు 7వ తేదీ మనకు జాతీయ చేనేత దినోత్సవం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చాలామందికి అతిపెద్ద ఆదాయ వనరు చేనేత ఉత్పత్తులే. అందుకే వాటిని కొనుగోలు చేయండి.
► 2014 నుంచి మన దేశంలో ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడం హర్షించదగ్గ పరిణామం.
సాయిప్రణీత్‌కు ప్రత్యేక అభినందనలు
దేశంలో వివిధ కీలక రంగాల్లో పలువురు కొనసాగిస్తున్న కృషిని ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రశంసించారు. వాతావరణ నిపుణుడిగా (వెదర్ మ్యాన్) గుర్తింపు పొందిన సాయిప్రణీత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వాతావరణ సంబంధిత అంశాలను క్షుణ్నంగా విశ్లేషించడంలో దిట్టగా ప్రఖ్యాతి పొందారు. సాయి ప్రణీత్ తన ఆసక్తి, ప్రతిభను రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారని మోదీ కితాబిచ్చారు. వాతావరణ వివరాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి విశ్లేషిస్తూ, స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు పంపడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment