National Herald Case: ED Summons Sonia Gandhi, Rahul Gandhi - Sakshi
Sakshi News home page

మనీ ల్యాండరింగ్‌ కేసులో.. సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు

Published Wed, Jun 1 2022 1:59 PM | Last Updated on Thu, Jun 2 2022 7:31 AM

National Herald Case: ED Summons Sonia Gandhi Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం రాహుల్, జూన్‌ 8న సోనియా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవాలని ఆదేశించింది. ఈ మేరకు వారికి సమన్లు పంపినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. సోనియా, రాహుల్‌లకు సమన్ల జారీపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

ఇలాంటి వాటికి భయపడబోమని కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వి, రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. కేంద్రం కుట్రలకు తలవంచేది లేదని స్పష్టం చేశారు. ‘‘తప్పుల తడకల కేసులు పెట్టినంత మాత్రాన బీజేపీ కుట్రలేవీ ఫలించవు. మోదీ ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి. స్వాతంత్య్రోద్యమ వాణి వినిపించిన పత్రిక నేషనల్‌ హెరాల్డ్‌. దాన్ని అడ్డు పెట్టుకుని సోనియాను, రాహుల్‌ను భయపెట్టలేరు’’ అన్నారు. కేంద్రం కుట్రలను చట్టపరంగా, సామాజికంగా, రాజకీయంగా కాంగ్రెస్‌ ఎదుర్కొంటుందని చెప్పారు. రాహుల్‌ విదేశాల్లో ఉన్నందున విచారణ తేదీని వాయిదా వేయాలని కోరినట్టు సింఘ్వి తెలిపారు. జూన్‌ 5 తర్వాత అందుబాటులో ఉంటానంటూ ఈడీకి లేఖ రాశారని మీడియాకు వెల్లడించారు.

చట్టం తన పని చేస్తుంది: ఠాకూర్‌
కాంగ్రెస్‌ ఆరోపణలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. దర్యాప్తు సంస్థలు తమ పని చేసుకుంటూ వెళ్తాయని స్పష్టం చేసింది. తప్పు చేయకపోతే వారి నిర్దోషిత్వం కోర్టులో రుజువవుతుందని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా అన్నారు. అలాంటప్పుడు ఆందోళన దేనికని మంత్రులు ఠాకూర్, కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

ఏమిటీ కేసు?
నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను స్వాతంత్రోద్యమ సమయంలో 1938లో నెహ్రూతో పాటు పలువురు స్వాతంత్య్ర యోధులు రూ.5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక కాంగ్రెస్‌ హయాంలో హెరాల్డ్‌ ప్రచురణ సంస్థ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవనాల రూపంలో ఎన్నో ఆస్తులు కట్టబెట్టాయి. 2008కల్లా పత్రిక మూతపడింది. జీతాలు తదితర బకాయిల చెల్లింపు కోసమంటూ పార్టీ నిధి నుంచి ఏజేఎల్‌కు రూ.90 కోట్లు కాంగ్రెస్‌ అప్పుగా ఇచ్చింది.

తర్వాత రెండేళ్లకు సోనియా, రాహుల్‌ మూడొంతుల వాటాదార్లుగా రూ.5 లక్షల మూలధనంతో యంగ్‌ ఇండియన్‌ అనే సంస్థ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్‌ నేతలు, గాంధీల నమ్మకస్తులైన మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ అందులో మిగతా వాటాదార్లు. రూ.90 కోట్ల రుణాన్ని ఏజేఎల్‌ ఎటూ తీర్చలేదు గనుక దాని తరఫున ఏక మొత్త పరిష్కారంగా 50 లక్షలు చెల్లిస్తానంటూ యంగ్‌ ఇండియన్‌ ఇటు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అటు రుణం తీర్చినందుకు బదులుగా ఏజేఎల్‌ నుంచి నేషనల్‌ హెరాల్డ్‌ వాటాలను తనకు బదలాయించుకుంది.

అలా వేల కోట్లు చేసే హెరాల్డ్‌ ఆస్తులన్నీ కారుచౌకగా సోనియా, రాహుల్‌ యాజమాన్యంలోని యంగ్‌ ఇండియన్‌ పరమయ్యాయని ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. యంగ్‌ ఇండియన్‌ పేరిట హెరాల్డ్‌ ఆస్తులను గాంధీలు అక్రమంగా సొంతం చేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో 2013లో ఈ ఉదంతంపై ఈడీ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే, పవన్‌ బన్సల్‌లను విచారించింది. యంగ్‌ ఇండియన్, ఏజేఎల్‌ ఆర్థిక లావాదేవీలు, ప్రమోటర్ల పాత్ర, షేర్‌హోల్డింగ్‌ తదితరాలపై స్పష్టత కోసం రాహుల్, సోనియాలను విచారించి వారి స్టేట్‌మెంట్లు నమోదు చేయనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. 

చదవండి: కాంగ్రెస్‌పై పీకే ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement