ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ/ఖాట్మండూ: నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడాల్సిన తీరుపై ఇరు దేశాధినేతలు చర్చించారు. నేపాల్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్నేహ హస్తం అందించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాల గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ)
అయితే గత కొన్ని రోజులుగా సరిహద్దుల విషయంలో నెలకొన్న వివాదం గురించి మాత్రం ఏవిధమైన చర్చ జరగలేదు. ఈ మేరకు విదేశాంగ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా సుదీర్ఘ కాలంగా మిత్ర దేశంగా కొనసాగుతున్న భారత్ పట్ల నేపాల్ అనుచిత వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్‌లో కలుపుతూ కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కొత్త మ్యాపులు విడుదల చేసింది. అంతేగాక దీనిని ఐరాసకు పంపించేందుకు సిద్ధమైంది. ఇక చైనాతో చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆ దేశ ప్రధాని ఓలి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత తొలిసారిగా ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేయడం గమనార్హం.(చైనా పేరెత్తడానికి భయమెందుకు?)
భారత ప్రజలకు శుభాకాంక్షలు: చైనా
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘భారత ప్రభుత్వం, ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ప్రాచీన నాగరికత గల రెండు గొప్ప దేశాలైన చైనా, భారత్ పరస్పరం సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతూ శాంతి, అభివృద్ధి సాధించాలి’’అని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. కాగా గల్వాన్ ఘటనలో చైనా ఎంతమాత్రం బాధ్యత వహించబోదని సన్ వెడాంగ్ ఇటీవలి తన ఆర్టికల్‌లో పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
Congratulations to the Indian government & people on #IndependenceDay2020. Wish #China & #India, two great nations with ancient civilization prosper together in peace and develop with closer partnership.
— Sun Weidong (@China_Amb_India) August 15, 2020
Comments
Please login to add a commentAdd a comment