న్యూఢిల్లీ: దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో నూతన అకడమిక్ సెషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్ సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియలు సెప్టెంబర్ 30కి పూర్తవుతాయని తెలిపింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్రాల బోర్డులు ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించాలని వర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. ఈ ఫలితాలన్నీ జూలై 31 లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది.
ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడమిక్ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి ఆరంభమవుతుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తరగతులు, పరీక్షల్లాంటివి నిర్వహించాలని సూచించింది. పరిస్థితులు బాగాలేనందున ఒకవేళ ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ క్యాన్సిలైనా, వేరే చోటికి మారినా వారు చెల్లించిన ఫీజులను పూర్తిగా వాపసు చేయాలని కళాశాలలను, యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 31కల్లా పూర్తి చేయాలని కోరింది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment