
న్యూఢిల్లీ: భర్త నుంచి వేరుగా ఉండే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. కుటుంబ పింఛను కోసం నామినీలుగా ఇకపై తన పిల్లల పేర్లను పేర్కొనవచ్చని తెలిపింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పింఛను)నిబంధనలు–2021లోని 50వ క్లాజ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భాల్లో కుటుంబ పింఛను మంజూరవుతుందని పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు మరణించినప్పుడు ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి కుటుంబపింఛను అందుతుందని తెలిపింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామి కుటుంబ పింఛనుకు అనర్హులైనప్పుడు లేదా చనిపోయినప్పుడు కుటుంబ పింఛను ఇతర కుటుంబసభ్యులకు అందుతుందని వివరించింది.
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ పింఛనుకు నామినీలుగా భర్త కంటే ముందుగా సంతానాన్ని పేర్కొనేందుకు వీలు కలి్పస్తూ తాజాగా నిబంధనలను మార్చినట్లు కేంద్ర పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం పేర్కొంది. తాజా సవరణ.. మహిళా ప్రభుత్వోద్యోగి విడాకుల పిటిషన్, గృహ హింస కేసు, మహిళల రక్షణ చట్టం కింద కేసులను దాఖలు చేసిన అన్ని సందర్భాల్లో, ఆమె భర్త కంటే ముందు అర్హత ఉన్న బిడ్డకు కుటుంబ పెన్షన్‌ను పంపిణీ చేయడానికి అనుమతిస్తుందని విభాగం కార్యదర్శి వి శ్రీనివాస్ పిటిఐకి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment