సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తథ్యమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైతేనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని.. అది కూడా నిర్దిష్ట విషయాల్లో మాత్రమే సంప్రదిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమయ్యే అంశాల్లో ఈ సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఈ ఏడాది జనవరి 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(విశాఖ ఉక్కు పరిశ్రమ) ప్రైవేటీకరణలో భాగంగా వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ అనుమతి తెలిపిందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ వాటా ఉపసంహరణ అనేది.. వినియోగం, సామర్థ్య విస్తరణ, సాంకేతికత పెంచడం, మెరుగైన నిర్వహణ పద్ధతులకు తగిన పెట్టుబడులు తీసుకొచ్చేలా ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా ఉత్పత్తితో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. అలాగే భాగస్వాములు, ఉద్యోగుల వాటా కొనుగోలు చేయడానికి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ నిబంధనలు వర్తిస్తాయని సీతారామన్ పేర్కొన్నారు.
ఆస్తులు రూ.32 వేల కోట్లు.. అప్పులు రూ.21 వేల కోట్లు
విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు ఆస్తులు, అప్పులపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు మార్గాని భరత్, బాలశౌరి, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరును ఆయన వివరించారు. విశాఖ ఉక్కు ప్లాంటు, పరికరాలు, ఆస్తులు విలువ గతేడాది డిసెంబర్ 31 నాటికి రూ.32,022.32 కోట్లుగా ఉందని చెప్పారు. ప్రభుత్వ ఈక్విటీ షేర్ పెట్టుబడి విలువ రూ.4,889.85 కోట్లుగా ఉందని తెలిపారు. అలాగే గతేడాది డిసెంబర్ 31 నాటికి రూ.21,236.01 కోట్ల అప్పులున్నాయని వివరించారు.
ప్రైవేటీకరణ తథ్యం
Published Tue, Mar 9 2021 2:32 AM | Last Updated on Tue, Mar 9 2021 8:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment