సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. సంచలన ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నీతి ఆయోగ్ ఒక పనికి మాలిందని, నీతి ఆయోగ్ సమావేశాలు భజన బృందంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోపణలు చేసిన కాసేపటికే నీతి ఆయోగ్ తీవ్రంగా స్పందించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణలు అర్థరహితం. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసమే ఈ సంస్థ ఏర్పాటు. గడిచిన ఏడాదిలోనే సీఎంలతో ముప్ఫై సమావేశాలు నిర్వహించాం. నీతిఆయోగ్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో గతేడాది జనవరి 21న రాష్ట్రాభివృద్ధి అంశాలపై తెలంగాణ సీఎంతో భేటీ అయ్యాం.
పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించినా.. తెలంగాణ సీఎం స్పందించలేదు. రేపటి సమావేశానికి ఆయన హాజరుకావొద్దన్న నిర్ణయం దురదృష్టకరం. రాష్ట్రాలకు ఎజెండా తయారీలో నీతి ఆయోగ్ సహకరించడం లేదన్న ఆరోపణలు సరికాదు. కేంద్రం రాష్ట్రాలకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తుంది. 2015-16లో రూ. 2 లక్షల 3 వేల 740 కోట్లు.. 2022-23 ఏడాదికి రూ.4 లక్షల 42 వేల 781 కోట్లకు చేరింది. జల్‌జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయింపు జరిగింది.
కానీ, తెలంగాణ కేవలం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. పీఎంకేఎస్‌వై-ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుదల అయ్యాయి అని గణాంకాలతో సహా సీఎం కేసీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది నీతి ఆయోగ్.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం ఉండే వేదిక. రాష్ట్ర స్థాయిలలో కీలకమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై చర్చించి, జాతీయ అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశ్యంతో స్పూర్తితో నీతి ఆయోగ్ ఒక సంస్థగా ఏర్పాటు చేయబడింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం అని ప్రకటించుకుంది..
ఇదీ చదవండి: నీతి ఆయోగ్ తెలంగాణను మెచ్చుకుంది కూడా-సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment