నీతిఆయోగ్‌ భేటీకి ఆరుగురు సీఎంలు దూరం | Niti Aayog meeting faces boycott from opposition leaders | Sakshi
Sakshi News home page

నీతిఆయోగ్‌ భేటీకి ఆరుగురు సీఎంలు దూరం

Published Sat, Jul 27 2024 4:51 AM | Last Updated on Sat, Jul 27 2024 4:51 AM

Niti Aayog meeting faces boycott from opposition leaders

న్యూఢిల్లీ: హస్తినలో శనివారం జరగబోయే నీతి ఆయోగ్‌ పాలకమండలి భేటీని విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన ఆరుగురు సీఎంలు బహిష్కరించారు. కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపారంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), సుఖీ్వందర్‌ సింగ్‌ సుఖూ (హిమాచల్‌ ప్రదేశ్‌)తో పాటు ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు), విజయన్‌ (కేరళ), భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌) ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వమూ భేటీని బాయ్‌కాట్‌ చేసింది.

ప్రణాళికా సంఘమే కావాలి: మమత
పశి్చమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ మాత్రం భేటీలో పాల్గొంటానని స్పష్టంచేశారు. ‘‘బడ్జెట్‌ కేటాయింపుల్లో విపక్షాలపాలిత రాష్ట్రాలపై మోదీ సర్కార్‌ వివక్షను భేటీలో ప్రస్తావిస్తా. బెంగాల్‌లో విభజన రాజకీయాలు తెస్తూ పొరుగురాష్ట్రాలతో వైరానికి వంతపాడుతున్న కేంద్రాన్ని కడిగేస్తా. నీతి ఆయోగ్‌ ప్రణాళికలు ఒక్కటీ అమలుకావడం చూడలేదు. ప్రణాళికా సంఘంలో ఒక విధానమంటూ ఉండేది. రాష్ట్రాల సూచనలకు విలువ ఇచ్చేవారు. నీతిఆయోగ్‌లో మా మాట వినే అవకాశం లేదు. పట్టించుకుంటారన్న ఆశ అస్సలు లేదు. అందుకే ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలి’’ అని మమత అన్నారు. 

నేడు మోదీ నేతృత్వంలో భేటీ 
2047 ఏడాదికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు నేడు ప్రధాని మెదీ అధ్యక్షతన 9వ నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరుకానున్నారు. అయితే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి ఈ భేటీకి రావట్లేదని తెలుస్తోంది. పుదుచ్చేరిలో రంగస్వామికి చెందిన ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్రాలు ఎలా మరింత సమన్వయంతో పనిచేయాలనే అంశాలనూ ఈ భేటీలో చర్చించనున్నారు. వికసిత భారత్‌కు దార్శనిక పత్రం రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రతువులో రాష్ట్రాల పాత్రపై విస్తృతస్థాయిలో చర్చ జరగనుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సులో చేసిన సిఫార్సులనూ సమావేశంలో పరిశీలించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement