ఢిల్లీ: జనాభా నియంత్రణ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ, ఢిల్లీ మహిళా ప్యానెల్ హెడ్ స్వాతి మలివాల్‌లు విరుచుకుపడ్డారు. నితీష్ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"నితీష్ కుమార్ వ్యాఖ్యలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయి. ఇంతటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి" అని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్‌లో పేర్కొంది. 'నితీష్ మాట్లాడిన చెత్త వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయి. అసెంబ్లీలో వాడిన ఇలాంటి అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి ఓ మరక. ప్రజాస్వామ్యంలో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.' అని రేఖా శర్మ అన్నారు.
నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. స్త్రీద్వేషి, పితృస్వామ్య స్వభావం అంటూ మండిపడింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలతో నితీష్ కుమార్ ప్రజాస్వామ్యం గౌరవాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే దుయ్యబట్టారు.
స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్‌లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు.
ఇదీ చదవండి: నోరుజారిన సీఎం నితీష్.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment