
రాధామోహన్ సింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మార్పులు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ఉపాధ్యక్షుడు, యూపీలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ఈ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి సరైన సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేపడ్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి మధ్య విభేదాలు నెలకొన్నాయనే ఊహాగానాలను కొట్టిపారేశారు. యూపీ ప్రభుత్వ, పార్టీ నాయకత్వాలను మార్చే అవకాశాలను తోసిపుచ్చారు.
సీఎం, యూపీ బీజేపీ అధ్యక్షుడు ఇద్దరూ బాగానే పనిచేస్తున్నారన్నారు. ముగ్గురు మంత్రులు మరణించడంతో ఏర్పడిన ఖాళీలతో పాటు మిగతా ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అప్పుడే ప్రక్షాళన తప్పదని ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాధామోహన్ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను వ్యక్తిగత కారణాలతో కలిశానని, కేబినెట్‌లో మార్పులకు సంబంధించి కాదని రాధామోహన్ సింగ్ తెలిపారు. మంత్రివర్గంలో కొన్ని ఖాళీలున్న విషయ వాస్తవమే అయినా, అవి అంత ముఖ్యమైన శాఖలకు సంబంధించినవి కావని వివరించారు. అందువల్ల కేబినెట్ విస్తరణ తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని తెలిపారు.