180 జిల్లాల్లో కనిపించని వైరస్‌ జాడ | No Corona Virus Cases In 180 Districts In A week: Harsh Vardhan | Sakshi
Sakshi News home page

180 జిల్లాల్లో కనిపించని వైరస్‌ జాడ

Published Sun, May 9 2021 12:56 AM | Last Updated on Sun, May 9 2021 9:16 AM

No Corona Virus Cases In 180 Districts In A week: Harsh Vardhan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వారం రోజులుగా దేశవ్యాప్తంగా 180 జిల్లాలు, 14 రోజులలో 18 జిల్లాలు, 21 రోజులుగా 54 జిల్లాలు, 28 రోజుల్లో 32 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కోవిడ్‌ బాధితుల్లో పరిస్థితి క్లిష్టంగా ఉండి ఐసీయూలో 4,88,861 మంది, వెంటిలేటర్‌ సపోర్ట్‌పై 1,70,841 మంది, ఆక్సిజన్‌ సపోర్ట్‌పై 9,02,291 మంది ఉన్నారని వెల్లడించారు. మొత్తం బాధితుల్లో 1.34% మంది ఐసీయూలో, 0.39% వెంటిలేటర్లపై, 3.70% మంది ఆక్సిజన్‌ సపోర్ట్‌పై ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం 25వ సమావేశానికి మంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షత వహించారు.

మూడు రోజుల్లో 53 లక్షల డోసుల టీకా 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం ఇప్పటివరకు 17,49,57,770 డోస్‌లను రాష్ట్రాలకు పంపిణీ చేయగా, అందులో 16,65,49,583 డోస్‌ల వినియోగం జరిగిందని మంత్రి తెలిపారు. ఇంకా 84,08,187 డోస్‌లు ఇప్పటికీ రాష్ట్రాల వద్ద  అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 53,25,000 వ్యాక్సిన్‌ డోస్‌లు సిద్ధంగా ఉన్నాయనీ, రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్‌–19 నుంచి పూర్తి రక్షణను పొందేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ప్రజలందరూ వ్యాక్సిన్‌ రెండు డోస్‌లను పొందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

పెరిగిన పరీక్షల సామర్థ్యం 
దేశం రోజుకు 25 లక్షల టెస్ట్‌ల పరీక్షా సామర్థ్యాన్ని చేరుకుందని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 30,60,18,044 పరీక్షలు జరిగాయని, ఇందులో గత 24 గంటల్లో 18,08,344 పరీక్షలు ఉన్నాయని అన్నారు. అంతేగాక గతంలో పుణేలోని ఎన్‌ఐవీ కేవలం ఒక ల్యాబ్‌ ఉన్న పరిస్థితి నుంచి, ప్రస్తుతం దేశంలో 2,514 ల్యాబ్‌ల ద్వారా సేవలు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టైర్‌ –2, టైర్‌–3 నగరాల్లో టెస్టింగ్‌ సెంటర్లు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచే అవసరం, ప్రాముఖ్యత ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుజీత్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టంచేశారు.  

గత ఏడు రోజుల్లో సంక్రమణ కేసులు మహారాష్ట్ర (1.27%), కర్ణాటక (3.05%), కేరళ (2.35%), ఉత్తరప్రదేశ్‌ (2.44%), తమిళనాడు (1.86%), ఢిల్లీ (1.92%), ఆంధ్రప్రదేశ్‌ (1.90%), పశ్చిమ బెంగాల్‌ (2.19%), ఛత్తీస్‌గఢ్‌(2.06%), రాజస్తాన్‌ (2.99%), గుజరాత్‌ (2.40%), మధ్యప్రదేశ్‌ (2.24%) రాష్ట్రాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు.  బెంగళూరు (అర్బన్‌), గంజాం, పుణే, ఢిల్లీ, నాగపూర్, ముంబై, ఎర్నాకులం, లక్నో, కోజికోడ్, థానే, నాసిక్, మలప్పురం, త్రిస్సూర్, జైపూర్, గురుగ్రామ్, చెన్నై, తిరువనంతపురం, చంద్రాపూర్, కోల్‌కతా, పాలక్కడ్‌ జిల్లా/ మెట్రో నగరాల్లో యాక్టివ్‌ కేసులు అధికంగా ఉన్నాయని వివరించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ఎస్‌.జైశంకర్, హర్దీప్‌ సింగ్‌ పూరి, మన్సుఖ్‌ మాండవీయ, నిత్యానంద్‌ రాయ్, అశ్విని కుమార్‌ చౌబే, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వినోద్‌ పాల్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

అమెరికా ఆరోగ్య మంత్రితో హర్షవర్ధన్‌ చర్చలు 
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్‌ శనివారం అమెరికా ఆరోగ్య మంత్రి జేవియర్‌ బెసెర్రాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందని బెసెర్రా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా, కోవిడ్‌ వ్యాక్సిన్లపై మేథో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు మున్ముందు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)తో జరిగే చర్చల్లో ఇదే విధమైన వెసులుబాటు కల్పిస్తామన్నారు. కోవిడ్‌పై పోరాటంలో భారత్‌కు సహకరించడానికి అధ్యక్షుడు బిడెన్‌ కూడా కట్టుబడి ఉన్నారని బెసెర్రా తెలిపారని హర్షవర్ధన్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement