న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పిల్లల్లోనూ ప్రభావం చూపిస్తోంది. చిన్నారులు సైతం వైరస్ బారినపడుతున్నారు. అయితే, వారిలో లక్షణాలు అంతగా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్‌ఎస్) సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కోవిడ్ చికిత్సలో భాగంగా పెద్దలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, పిల్లలకు ఈ ఇంజక్షన్ ఇవ్వొద్దని డీజీహెచ్‌ఎస్ తేల్చిచెప్పారు. అంతేకాకుండా సీటీ స్కాన్ విషయంలోనూ హేతుబద్ధత ఉండాలని వెల్లడించారు. అంటే అవసరం మేరకు పరిమితంగానే సీటీ స్కాన్ చేయాలని పేర్కొన్నారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనా కేసుల్లో స్టెరాయిడ్ల వాడకం హానికరమని హెచ్చరించారు. హాస్పిటల్‌లో చేరిన వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్న బాధితులకే స్టెరాయిడ్లు ఇవ్వొచ్చని సూచించారు. అదికూడా సీనియర్ వైద్యుడి పర్యవేక్షణలోనే స్టెరాయిడ్లు ఇవ్వాలన్నారు. సరైన సమయంలో, సరైన డోసు, సరైన కాల వ్యవధిలోనే స్టెరాయిడ్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
డీజీహెచ్‌ఎస్ మార్గదర్శకాలు
►18 ఏళ్లలోపు వారికి రెమ్‌డెసివిర్ వాడకం, అది చూపించే ప్రభావం, భద్రతపై ఇప్పటిదాకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. అందుకే వారికి కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్‌ను సూచించడం లేదు.
►అధిక తీవ్రత కలిగిన సీటీ (హెచ్‌ఆర్‌సీటీ) స్కాన్ వాడకంలో హేతుబద్ధత అవసరం.
►కోవిడ్–19 అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీని నియంత్రణలో యాంటీమైక్రోబయల్స్ ఉపయోగం పెద్దగా ఉండదు.
►లక్షణాలు, తక్కువ తీవ్రత కలిగిన కేసుల్లో యాంటీమైక్రోబయల్స్ అవసరం లేదు.
►పిల్లలకు కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోతే ప్రత్యేకంగా చికిత్స ఏదీ అక్కర్లేదు. వారికి బలవర్థకమైన ఆహారం, పోషకాహారం అందజేయాలి. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి.
►స్వల్పంగా లక్షణాలు ఉంటే పారాసెటమాల్ మాత్రలు ప్రతి 4–6 గంటలకోసారి ఇవ్వాలి. దగ్గు ఉంటే సిరప్ వాడొచ్చు.
►ఇన్ఫెక్షన్ కొంత ఎక్కువ మోతాదులో ఉంటే వెంటనే ఆక్సిజన్ చికిత్స ప్రారంభించాలి.
►స్వల్ప మోతాదులో ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు కారి్టకోస్టెరాయిడ్లు ఇవ్వొద్దు.
►ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటేనే యాంటీమైక్రోబయల్స్ ప్రయత్నించవచ్చు.
►12 ఏళ్లు దాటి కరోనా సోకిన పిల్లల వేలికి పల్స్ ఆక్సీమీటర్ అమర్చి, ఆరు నిమిషాలపాటు నడిపించాలి. వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఏ మేరకు ఉందన్నది దీని ద్వారా తెలుసుకోవచ్చు. దాన్నిబట్టి చికిత్స చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment