‘కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. 1939లో అమల్లోకి వచ్చిన ప్రజారోగ్యచట్టం ప్రకారం ప్రజలకు ఆరోగ్యవసతులు కల్పించాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఉమ్మేయడం, వీధుల్లో చెత్త వేయడంపై నిషేధం విధిస్తూ 2002లో మరో చట్టం వచ్చింది. కాగితాలకే పరిమితమైన ఈ చట్టా న్ని అమలు చేసేందుకు తీవ్రమైన చర్యలు చేపట్టాలి. తమిళనాడులో జనాభా దామాషా ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లకు పర్యవేక్షణ లేదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం, మూత్ర విసర్జన నిరోధించలేకపోయారు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా శిక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. వైద్యవ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులను శాస్త్రీయంగా విభంజించి నిర్మూలించాలి. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో తగిన మరుగుదొడ్ల వసతి ఉందోలేదో తనిఖీ చేయాలి. ఘనవ్యర్థాల మేనేజ్‌మెంట్ విధులను కఠినంగా అమలుచేయాలి. వీధుల్లో నివసించే వారిని కేటగిరి వారీగా విభజించి శరణాలయాలకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించాలి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, హేమలతతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది. సదరు పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఒకటి నుంచి మాస్క్‌ల పంపిణీ
ఇంటింటికీ ఉచిత మాస్కుల పంపిణీకి ఆగస్టు 1వ తేదీ నుంచి టోకెన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఎన్నిమార్లు ప్రచారం చేసినా ప్రజల్లో అధిక శాతం మాస్కులు ధరించనందునే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా రెండు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని సంకల్పించింది. మాస్కుల పంపిణీ సులువుగా సాగేందుకు రేషన్ దుకాణదారులు వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో ఇంటింటా టోకన్లు పంపిణీ చేయనున్నట్టు గురువారం తెలిపింది. ఇదిలావుండగా లాక్‌డౌన్ కారణంగా అమెరికా, నెదర్లాండ్, సౌదీ, కతర్, జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లో చిక్కుకున్న 834 మంది భారతీయులు ఆరు ప్రత్యేక విమానాల ద్వారా గురువారం చెన్నైకి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment