షిల్లాంగ్: మేఘాలయాలో సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రాంతీయ పార్టీల సభ్యులంతా.. ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ)కి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. దీంతో ఎన్‌పీపీ కూటమి బలం 32 నుంచి 45కి చేరగా, తాజా మాజీ సీఎం కొన్రాడ్ కే సంగ్మా రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మేఘాలయా రాజకీయాలు ఆదివారం వరకు ఉత్కంఠగానే సాగాయి. 26 మంది సొంత పార్టీ సభ్యులు, ఇద్దరు బీజేపీ, మరో ఇద్దరు హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెస్‌ఎస్‌పీడీపీ) ఎమ్మెల్యేలు.. మొత్తంగా 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ శుక్రవారం గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి లేఖ సమర్పించారు కొన్రాడ్ సంగ్మా. అయితే.. ఆ మద్దతును ఉపసంహరించుకున్నట్లు వెంటనే హెస్‌ఎస్‌పీడీపీ చీఫ్ ప్రకటించడం, వివిధ పార్టీలను కూడగలుపుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రకటించడం ఆసక్తిని రెకెత్తించింది.
ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ అయిన టీఎంసీ(ఐదు సీట్లు దక్కించుకుంది)తో కలిసి ఏకతాటి పైకి వచ్చేందుకు మొగ్గు చూపించకపోవడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. చివరకు.. మేఘాలయా ప్రధాన ప్రాంతీయ పార్టీలైన యూడీపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) సభ్యులు సైతం ఎన్‌పీపీ కూటమికే మద్దతు ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. సంగ్మాను కలిసి తమ మద్దతును బలపరుస్తూ లేఖను అందించారు.
ఎన్‌పీపీ 26, యూడీపీ 11, పీడీఎఫ్ 2, హెస్‌ఎస్‌పీడీపీ 2, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతోపాటు బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో మేఘాలయా డెమొక్రటిక్ అలయన్స్(MDA) ప్రభుత్వం కొలువు దీరనుంది. సోమవారం(ఇవాళ) మేఘాలయా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. వారంలోపు స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ఫిబ్రవరి 27వ తేదీన 60 స్థానాలున్న మేఘాలయా అసెంబ్లీలో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒక చోట సిట్టింగ్ అభ్యర్థి మరణంతో ఎన్నిక నిర్వహణ నిలిపివేసింది ఎన్నికల సంఘం.
Comments
Please login to add a commentAdd a comment